
రోజూ బ్రేక్‌ఫాస్ట్‌కు ఇడ్లీ పెడతాం. కానీ రోజూ అదే వంట అంటే పిల్లలకే కాదు పెద్దవాళ్లకూ అలసట వచ్చేస్తుంది. చాలా సార్లు మిగిలిన ఇడ్లీ పిండిని ఏం చేయాలో అర్థం కాక పక్కన పెట్టేస్తాం. కానీ ఇప్పుడు ఆ పిండితో కొత్తగా, టేస్టీగా, కరకరలాడే పునుగులు చేసి ఇంట్లో అందరికీ సర్ప్రైజ్ ఇవ్వండి. పైగా ఈ పునుగులు వంటసోడా లేకుండానే చేసేయొచ్చు.
ఈ రుచికరమైన పునుగుల కోసం కావాల్సింది మీ ఇంట్లోనే ఉంటాయి. మిగిలిన ఇడ్లీ పిండి తీసుకోండి. అందులో కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిర్చి తరుగు, మునగాకు, ఉల్లిపాయ తరుగు కలపండి. టేస్ట్ కోసం కొద్దిగా గోధుమ పిండి, బియ్యప్పిండి కూడా వేసి కలిపేస్తే చాలు. పిండి కాస్తగా కట్టుదిట్టగా ఉండాలి. తరువాత కడాయిలో నూనె వేడి చేసి, చిన్న చిన్న బంతుల్లా వేశాక రెండు వైపులా బాగా వేపండి. క్రిస్పీగా, గోల్డెన్ కలర్ వచ్చేసరికి ప్లేట్లోకి తీసుకొని టమాటా చట్నీతో తింటే – ఆ టేస్ట్ మాటల్లో చెప్పలేం.
ఇక ఈ పునుగుల రుచికి రహస్యం – మునగాకే. ఇది వేస్తే రుచి రెట్టింపు అవుతుంది. అందులో పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు మునగాకు ఇష్టం లేకపోతే కొత్తిమీర, మెంతికూర కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా మంచి ఫ్లేవర్ ఇస్తాయి. పిండి కాస్త పల్చగా అనిపిస్తే కొద్దిగా బియ్యప్పిండి వేసుకోండి. చాలా గట్టిగా ఉంటే తక్కువ నీళ్లు వేసి కలుపుకుంటే చాలు.
[news_related_post]ఇలా సింపుల్‌గా తయారయ్యే ఈ పునుగులు మిగిలిన ఇడ్లీ పిండితో చేయగలిగే బెస్ట్ రెసిపీ. బ్రేక్‌ఫాస్ట్‌కైనా, ఈవెనింగ్ స్నాక్కైనా ఒకసారి ట్రై చేస్తే తప్పకుండా మళ్లీ చేయాలనిపిస్తుంది. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. అందుకే ఇలాంటి టేస్టీ ఐటెం మిస్ అవ్వకుండా మీరూ ఈ రోజు ఓసారి ట్రై చేయండి!