వేడివేడిగా నోట్లోకి వేసుకుని తినాలని ఉంది కానీ ఏం తినాలో అర్థం కావడంలేదా? అయితే ఈసారి కాస్త డిఫరెంట్ గా, సౌత్ ఇండియా టెస్ట్‌తో నిండిన కర్ణాటక స్టైల్ అక్కి రొట్టె ట్రై చేయండి. బియ్యం పిండి, కూరగాయల మేళవింపు, కొంచెం మసాలాతో తయారయ్యే ఈ అక్కి రొట్టె మృదువుగా ఉంటూ, రుచి పరంగా అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈ టిఫిన్‌ను త్వరగా తయారు చేసుకోవచ్చు.
దీన్ని టిఫిన్, లంచ్ లేదా ఈవెనింగ్ స్నాక్‌గా కూడా తినవచ్చు. ఇప్పుడు మనం ఈ అక్కి రొట్టెను ఎలా తయారు చేయాలో, దానికి కావాల్సిన పదార్థాలు, చిన్న టిప్స్ తో కలిపి పూర్తి వివరణ తెలుసుకుందాం.
కర్ణాటక టచ్ ఉన్న అక్కి రొట్టె అంటే?
తెలుగులో మేము దీనిని ‘తపాలా చెక్క’ లేదా ‘సర్వపిండి’ అనే పేర్లతో పిలుస్తాం. కానీ కర్ణాటకలో దీనిని ‘అక్కి రొట్టె’గా పిలుస్తారు. ఈ అక్కి రొట్టెను ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో బియ్యం పిండి, తాజా కూరగాయలు, కొంచెం కొబ్బరి తురుము, అల్లం, జీలకర్ర వంటివి కలిపి చేసే మిక్స్ వల్ల దీనికి అదిరిపోయే రుచి వస్తుంది. నూనెలో కాల్చే సమయంలో వచ్చే అరోమా అసలే వదలదు. ఇది తినడం ఒక్కటే కాదు, చూసినా మనకే తినాలనిపిస్తుంది. చాలా మంది దీన్ని బ్రేక్‌ఫాస్ట్‌కు లేదా పిల్లల లంచ్ బాక్సుల కోసం రెడీ చేస్తారు.
కావాల్సిన పదార్థాలు ఎంటంటే?
ఇంట్లో రోజూ ఉండే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, కొబ్బరి ముక్కలు, అల్లం, కొత్తిమీర, కరివేపాకు వంటి కూరగాయలే చాలు. బియ్యం పిండి, జీలకర్ర, ఉప్పు, తగినంత నీళ్లు ఉంటే సరిపోతుంది. పైగా నూనె కూడా కొన్ని టేబుల్ స్పూన్లు అవసరం అవుతుంది. కొంత సమయం ఉంటే మెంతులు కూడా కలిపితే మంచి ఆరోగ్యకరమైన టచ్ వస్తుంది. ఈ పదార్థాలన్నింటినీ కలిపి పిండి మిశ్రమం తయారు చేయాలి.
పిండిని ఎలా కలపాలి?
ముందుగా అన్ని కూరగాయలను చిన్న చిన్న ముక్కలుగా తరిగేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, అల్లం, కొబ్బరి ముక్కలు అన్నీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి పిసికేయాలి. ఈ కూరగాయలలోని రసం బయటకు వచ్చిన తర్వాత బియ్యం పిండి వేసి కలపాలి. అప్పుడు పిండిలో కూరగాయల రుచి బాగా కలుస్తుంది. తర్వాత జీలకర్ర, క్యారెట్ తురుము, కొత్తిమీర, ఉప్పు వేసి మళ్లీ కలిపితే మిశ్రమం రెడీ అవుతుంది. కొంచెం వేడి నీళ్ళు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. చివరగా కొద్దిగా నూనె వేసి మిక్స్ చేసి కనీసం 15 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇది పిండికి మృదుత్వాన్ని ఇస్తుంది.
రొట్టెలను ఎలా కాల్చాలి?
పిండిని చిన్న ఉండలుగా చేసుకొని, అరటి ఆకు లేదా బటర్ పేపర్ మీద చేతితో మెల్లగా నెమ్మదిగా చాపాలి. పెనం మీద ఈ మిశ్రమాన్ని అద్ది, మద్యమమైన మంటపై రెండు వైపులా నూనె వేసుకుంటూ కాల్చాలి. ఒకవైపు రెండు నిమిషాలు కాల్చిన తర్వాత మరోవైపు తిప్పి మళ్లీ కాల్చాలి. రొట్టె మృదువుగా, సాఫ్ట్ గా తినగలిగేలా అయ్యేంత వరకూ కాల్చాలి. వీటిని వేడి వేడిగా చట్నీతో తింటే ఆ రుచి మరిచిపోలేరు.
వేడిగా తినాలి ఎందుకంటే
ఈ అక్కి రొట్టె వేడి వేడిగా ఉన్నప్పుడు చాలా మృదువుగా ఉంటుంది. కానీ ఒకసారి చల్లారిన తర్వాత గట్టిగా మారుతుంది. అందుకే తయారయ్యాక వెంటనే తినడం మంచిది. పిల్లలకి స్కూల్ కు పంపేటప్పుడు టిఫిన్ బాక్స్ లో వేడి వేడిగా పెట్టగలిగితే రుచి అలాగే ఉంటుంది. మీరు రుచిని ఇంకొంచెం పెంచాలంటే పిండిలో నువ్వులు కూడా కలిపేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి మంచిదే కాకుండా, రుచికీ స్పెషల్ టచ్ ఇస్తుంది.
ఎందుకు ఈ రొట్టెను తప్పక ట్రై చేయాలి?
అక్కి రొట్టె అనేది ఆరోగ్యకరమైన, త్వరగా తయారయ్యే టిఫిన్ రెసిపీ. ఇది పిల్లల నుండి పెద్దల వరకూ అందరికి నచ్చుతుంది. పైగా ఇందులో కూరగాయలతో పాటు అల్లం, జీలకర్ర, మెంతులు లాంటి పదార్థాల వల్ల పాచకశక్తికి మంచి. క్రమం తప్పకుండా టిఫిన్‌లో ఇది వేసుకుంటే విరేచనాలు, అజీర్ణం లాంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
ప్రతి రోజు కాకపోయినా, వారం ఒకటి రెండు సార్లు ఈ అక్కి రొట్టెను తయారు చేసి చూడండి. మీ కుటుంబ సభ్యులందరూ మెచ్చుకోవడం ఖాయం!
చివరగా చెప్పాలంటే
ఈ రోజు ఆఫీసు, కాలేజీకి వెళ్లే ముందు ఏం టిఫిన్ పెట్టాలో అయోమయంగా ఉందా? జస్ట్ 15 నిమిషాల్లో కర్ణాటక స్టైల్ అక్కి రొట్టె రెడీ చేసుకోండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే, పెద్దగా సమయం తీసుకోకుండా, ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ప్లేట్‌ను మీకు అందించగలగడమే ఈ రెసిపీ ప్రత్యేకత. వేడి వేడి రొట్టె, టమోటో పచ్చడి లేదా పెరుగు పచ్చడితో కలిపి తింటే అసలే మజా. ఈసారి ట్రై చేయండి.. మీరు కూడా ఫాలో అయ్యే రెసిపీగా ఇదే మారుతుంది!
మీరు ఈ అక్కి రొట్టెను ఇంట్లో తయారు చేసి చూడగానే మళ్లీ మళ్లీ చెయ్యాలనిపిస్తుంది. ఇంకేం ఆలస్యం? ఈ వారం వీకెండ్‌కి అందరినీ సర్‌ప్రైజ్ చేయండి!