కొత్త పన్ను వ్యవస్థను మరింత ఆకర్షణీయంగా మార్చనున్న నేపథ్యంలో పాత పన్ను వ్యవస్థను రద్దు చేయాలనే ప్రచారం మరోసారి ఊపందుకుంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. పాత పన్ను వ్యవస్థను రద్దు చేసే ప్రణాళిక లేదని ఆమె స్పష్టం చేశారు. ఇండియాటుడే-బిజినెస్టుడే నిర్వహించిన 2025 రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె దీని గురించి మాట్లాడారు.
“అందరు పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను వ్యవస్థకు మారాలని మీరు అనుకుంటున్నారా?” అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, పాత పన్ను వ్యవస్థను రద్దు చేసే ప్రతిపాదన తన వద్ద లేదని నిర్మలా సీతారామన్ అన్నారు. పన్ను దాఖలు ప్రక్రియను సులభతరం చేయాలనే ఉద్దేశ్యంతో కొత్త పన్ను వ్యవస్థను తీసుకువచ్చామని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా తీసుకురావాల్సిన కొత్త ఆదాయపు పన్ను చట్టం గురించి కూడా ప్రస్తావించారు. 1961లో తీసుకొచ్చిన పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు, చేర్పులతో కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడతామని వెల్లడించారు. రాబోయే కొద్ది రోజుల్లో ప్రవేశపెట్టనున్న ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందే అవకాశం ఉందని ఆమె అన్నారు.
జీఎస్టీ రేట్లపై త్వరలో నిర్ణయం
జీఎస్టీ స్లాబ్ తగ్గింపు, రేటు తగ్గింపు కీలక దశకు చేరుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు. దీనిపై త్వరలో జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంటుందని ఆమె చెప్పారు. ప్రస్తుతం 5, 12, 18 మరియు 28 శాతం నాలుగు శ్లాబులు అమలులో ఉన్నాయి. జీఎస్టీ రేట్ల హేతుబద్ధీకరణ మరియు రేట్ల సరళీకరణకు సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయిందని, త్వరలోనే జీఎస్టీ కౌన్సిల్లో దీనిపై నిర్ణయం తీసుకుంటారని ఆమె అన్నారు. రేట్లతో పాటు శ్లాబుల సంఖ్యను తగ్గించాలని తాను వ్యక్తిగతంగా కోరుకుంటున్నానని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించారనే ప్రచారాన్ని ఆమె తోసిపుచ్చారు. మూలధన వ్యయం తగ్గలేదని, రూ. 11.21 లక్షల కోట్లకు పెరిగిందని ఆమె అన్నారు. జీడీపీలో దీని వాటా 4.3 శాతంగా ఉందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.