ఢిల్లీ : దేశంలో పాఠశాల విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో-డిటెన్షన్ విధానాన్ని’ రద్దు చేసింది.దీంతో వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించని 5, 8 తరగతుల విద్యార్థులు మళ్లీ అదే తరగతుల్లో చదవాల్సి వస్తోంది.
కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేశారు. మార్చి 2019లో విద్యాహక్కు చట్టానికి చేసిన సవరణ ప్రకారం దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు ఇప్పటికే ఈ రెండు తరగతులకు నో-డిటెన్షన్ విధానాన్ని తొలగించాయి.
గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం.. పరీక్షల్లో ఉన్నత తరగతులకు పదోన్నతి పొందడంలో విఫలమైతే.. మళ్లీ పరీక్ష రాయడానికి కొంత సమయం ఇవ్వబడుతుంది. ఫలితాల ప్రకటన తేదీ నుండి రెండు నెలల్లోపు పరీక్ష తిరిగి నిర్వహించబడుతుంది. రీ ఎగ్జామ్‌లో ఫెయిల్ అయితే విద్యార్థులు మళ్లీ అదే తరగతిలో చదవాల్సి ఉంటుంది.
ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసేంత వరకు విద్యార్థులను బహిష్కరించేది లేదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని దాదాపు 3,000 కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ, సైనిక్ పాఠశాలలకు ఈ నోటిఫికేషన్ వర్తిస్తుందని కేంద్ర విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
స్కూల్ ఎడ్యుకేషన్ స్టేట్ లిస్ట్‌లో ఒక సబ్జెక్ట్ కాబట్టి, ఈ విషయంలో ఆయా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవచ్చు. ఢిల్లీ సహా 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ రెండు తరగతుల విద్యార్థులకు నో డిటెన్షన్ విధానాన్ని ఇప్పటికే రద్దు చేశాయని అధికారి తెలిపారు. హర్యానా, పుదుచ్చేరి ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
మిగిలిన రాష్ట్రాలు కూడా ఇదే విధానాన్ని కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు అధికారి తెలిపారు. నూతన విద్యా విధానంలో భాగంగా కేంద్రం గతంలో డిటెన్షన్ విధానం (వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయితే మళ్లీ అదే తరగతిలో చదివేలా చేయడం)పై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఇక్కడ ‘నో-డిటెన్షన్ పాలసీ’ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.