Millet drink: రోజుకు 1,000 బాటిళ్లు అమ్మకం… షుగర్ ఫ్రీ మిల్లెట్ డ్రింక్ తో ₹36 లక్షల టర్నోవర్…

ఇప్పుడు ప్యాకెట్ డ్రింక్‌ తీసుకోబోతే వాటిలో ఉన్న షుగర్‌, ప్రిజర్వేటివ్స్‌ వల్ల ఆరోగ్య సమస్యలు తప్పవు. అయితే, ఈ యువకుడు మాత్రం అందరికీ తాగేందుకు అనువైన ఆరోగ్యకరమైన మిల్లెట్ డ్రింక్‌ తయారీతో మార్కెట్‌లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. పేరు గండూరి శైలేష్‌. హైదరాబాద్‌కి చెందిన ఈ యువకుడు ఫార్మా రంగంలో 14 ఏళ్లు పని చేసిన అనుభవంతో, తన స్టార్టప్‌ ద్వారా “షుగర్ ఫ్రీ” మిల్లెట్ డ్రింక్‌ను మార్కెట్‌కు తీసుకొచ్చాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

షుగర్‌ పేషెంట్లకూ సేఫ్‌గా తాగేందుకు అనువుగా స్టీవియా అనే సహజ తీపి పదార్థాన్ని జోడించి తయారు చేసిన ఈ డ్రింక్‌ ఇప్పుడు డిమాండ్‌లో ఉంది.

షురూ ఎలా అయ్యింది?

ఫార్మా కంపెనీలో పని చేస్తూ మందుల వల్ల వచ్చే దుష్ఫలితాలపై ఆలోచించిన శైలేష్, “ఆహారమే ఔషధంగా ఉండాలి” అన్న అభిప్రాయం పెంచుకున్నాడు. మొదటిగా కొర్రలతో సేమియా తయారుచేశాడు కానీ అది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత మిల్లెట్ డ్రింక్‌ పై ఫోకస్‌ పెట్టాడు. విజయవాడలో విద్య పూర్తి చేసిన శైలేష్‌ హైదరాబాద్‌లో ఫార్మా రంగంలో పని చేసిన తర్వాత, 2023లో Farmnutra Millet Foods Pvt Ltd అనే స్టార్టప్‌ను బొల్లారంలో ప్రారంభించాడు.

Related News

రూ.75 లక్షలతో స్టార్టప్

శైలేష్ చేసిన పరిశోధనల ఆధారంగా తయారైన ప్రాజెక్టును ICAR-NAARM, Hyderabad లోని A-IDEA ఇంకుబేషన్ సెంటర్ ద్వారా పంపించాడు. ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం BIRAC సంస్థ  గుర్తించి రూ.50 లక్షల గ్రాంట్ మంజూరు చేసింది. అదనంగా అతను మరో రూ.25 లక్షలు వెచ్చించి, మొత్తం రూ.75 లక్షలతో మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేశాడు.

రోజుకు 1,000 పౌచులు… టర్నోవర్ రూ.36 లక్షలు

ప్రస్తుతం శైలేష్ కంపెనీ రోజుకు 1,000 మిల్లెట్ డ్రింక్ పౌచులు తయారుచేస్తోంది. ఆరెంజ్, పైనాపిల్, మ్యాంగో వంటి ఫ్లేవర్లలో ఈ డ్రింక్స్‌ అందుబాటులో ఉన్నాయి. Amazon, Flipkart, సొంత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ మార్కెటింగ్‌తో మంచి ఆదరణ పొందుతోంది. మొత్తం సంవత్సర టర్నోవర్ రూ.36 లక్షల వరకు చేరింది. అన్ని ఖర్చులు మినహాయించి నెలకు కనీసం రూ.1 లక్షల నికర లాభం వచ్చేస్తోంది.

రైతులకు మద్దతు… సహజ ఉత్పత్తులే స్పెషాలిటీ

మిల్లెట్ పానీయం తయారికి అవసరమైన కొర్రలు పాలమూరు, కర్నూలు జిల్లాల రైతుల నుంచి నేరుగా సేకరిస్తున్నారు. దీనివల్ల వారికి మంచి మద్దతు ధర లభిస్తోంది. డ్రింక్ తయారీలో ఏ రసాయన పదార్థాలు వాడకుండా, FSSAI అనుమతిచ్చిన సహజ రంగులు, తీపి పదార్థాలు మాత్రమే వాడుతున్నారు. ఈ డ్రింక్‌ తాగితే డైజేషన్ మెరుగవడం, శక్తి పెరగడం, మధుమేహం నియంత్రణ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

ఫ్రాంచైజీలు, ఉద్యోగాలు… విస్తరణ దిశగా ప్రయాణం

ఈ స్టార్టప్ ప్రస్తుతం అనంతపురంలో ఓ ఫ్రాంచైజీ ఇచ్చింది. ఇప్పటి వరకూ 5 మందికి ఉద్యోగాలు కల్పించిన శైలేష్‌, త్వరలో ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు కూడా ప్రయత్నిస్తున్నాడు. వ్యాయామం చేసిన తర్వాత తాగడానికి యూత్ దీనిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

ఇది షురూ మాత్రమే

“మన దేశం సంపద అయిన మిల్లెట్స్‌ను ఉపయోగించి ఆరోగ్యకరమైన, షుగర్‌ఫ్రీ పానీయం అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే నా లక్ష్యం” అంటున్న శైలేష్, తన ప్రయాణాన్ని ఇంకా విస్తృతంగా కొనసాగించాలని ధైర్యంగా చెబుతున్నాడు. తక్కువ పెట్టుబడితో ఓ పెద్ద మార్పు ఎలా తీసుకురావచ్చో ఈ యువకుడి కథ అందరికీ ప్రేరణగా నిలుస్తోంది.

ఇలాంటి తెలుగు యువకుల స్టార్టప్ విజయం గురించి తెలుసుకోవాలంటే, మళ్లీ కలుద్దాం!