
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య దెబ్బతిన్న సంబంధాలు మరో వివాదాస్పద మలుపు తిరిగాయి.
బిలియనీర్, ట్రంప్ సన్నిహితుడు ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. గతంలో, ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ ఆమోదం పొందితే, అమెరికాలో కొత్త పార్టీ ఏర్పడుతుందని మస్క్ ట్రంప్‌ను హెచ్చరించారు. అమెరికా 249వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్చనీయాంశమైన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’పై సంతకం చేశారు.
దీంతో ఆ బిల్లు చట్ట రూపం దాల్చింది. ఈ పరిణామం అనంతరం పారిశ్రామికవేత్త ఎలాన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ అనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ పార్టీ అమెరికా ప్రజలను ‘వన్ పార్టీ వ్యవస్థ’ నుంచి విముక్తి చేస్తుందని ఆయన తెలిపారు. మస్క్ ప్రకటన తర్వాత, అమెరికన్ రాజకీయాల్లో సంచలనం క్రియేట్ అయ్యింది.
[news_related_post]మస్క్ తన X (గతంలో ట్విట్టర్) వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటును ప్రకటించారు. ఇటీవలి సర్వే ఫలితాలను తన X పోస్ట్‌లో షేర్ చేస్తూ.. “ఈ రోజు మీకు మీ స్వేచ్ఛను తిరిగి ఇవ్వడానికి అమెరికా పార్టీ ఏర్పడింది” అని రాసుకొచ్చారు. సర్వేలో ప్రజలు 2:1 నిష్పత్తిలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కోరికను వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. “మీరు కొత్త రాజకీయ పార్టీని కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ రాజకీయ పార్టీ మీ ముందు ఉంది” అని తెలిపారు. తన ప్రకటనలో, మస్క్ ప్రస్తుత రాజకీయ వ్యవస్థను విమర్శిస్తూ, “మన దేశాన్ని వ్యర్థం, అవినీతితో దివాలా తీసే విషయానికి వస్తే, మనం ప్రజాస్వామ్యంలో కాదు, ఏకపార్టీ వ్యవస్థలో జీవిస్తున్నాము” అని అన్నారు.
“మీరు కోల్పోయిన స్వేచ్ఛను తిరిగి తీసుకురావడానికి అమెరికా పార్టీ ఏర్పడింది” అని కూడా ఆయన అన్నారు. ఈ పోల్‌లో 65.4% మంది ‘అవును’ అని ఓటు వేయగా, 34.6% మంది ‘లేదు’ అని తమ అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఈ బలమైన ప్రజా మద్దతు పార్టీని ప్రారంభించడానికి ప్రేరణగా మస్క్ పేర్కొన్నారు. రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్, డెమోక్రటిక్ పట్ల పెరుగుతున్న ప్రజా అసంతృప్తికి ప్రతిస్పందనగా ఈ కొత్త పార్టీని ఏర్పాటును ప్రకటించారు.