త్వరలో ఓటరు ఐడీతో ఆధార్ అనుసంధానం చేయనున్నారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఢిల్లీలో జరిగిన సమావేశంలో ఓటరు ఐడీ, ఆధార్ అనుసంధానం గురించి చర్చించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఈసీ, డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు, కేంద్ర హోం కార్యదర్శి, ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి, యూఐడీఏఐ సీఈఓ, ఎన్నికల కమిషన్ సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 326 ప్రకారం.. భారతీయ పౌరులకు మాత్రమే ఓటు హక్కు ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజాప్రాతినిధ్య చట్టం-1950, 2023లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ విషయంలో మరిన్ని చర్చలు జరగాలి. సాంకేతిక అంశాలపై త్వరలో యూఐడీఏఐ అధికారులతో సంప్రదింపులు జరుపుతామని ఈసీ స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రక్రియ, ఓటర్ల జాబితాలపై ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడంపై అన్ని రాజకీయ పార్టీలను సమావేశానికి ఆహ్వానించింది. ఎన్నికల రిజిస్ట్రేషన్ అధికారులు, జిల్లా ఎన్నికల అధికారులు, ప్రధాన ఎన్నికల అధికారుల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలపై ఏప్రిల్ 30 నాటికి అన్ని జాతీయ మరియు ప్రాంతీయ రాజకీయ పార్టీల నుండి సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ఈసీ తెలిపింది.