ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరారు. శనివారం సాయంత్రం ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చేరి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక సోషల్ మీడియా (X) ఖాతా ద్వారా తెలియజేశారు. “రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, సంబంధిత పరీక్షలు నిర్వహించారు. నివేదికలను పరిశీలించిన వైద్యులు అనేక సూచనలు చేశారు. మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం. మిగిలిన వైద్య పరీక్షలు ఈ నెలాఖరులోగా లేదా మార్చి మొదటి వారంలో జరుగుతాయి. పవన్ కళ్యాణ్ 24వ తేదీ నుండి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు హాజరవుతారు” అని ఆయన సోషల్ మీడియాలో తెలిపారు.
మరోవైపు.. పవన్ కళ్యాణ్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలుసుకున్న జనసేన పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు. ఆయన సాధారణ పరీక్షల కోసమే ఆసుపత్రికి వచ్చారని పార్టీ హైకమాండ్ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.