కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధార్ చట్టం 2016, రెగ్యులేషన్ 15, సెక్షన్ 7, మరియు దాని సవరణలు, అనుబంధ నిబందనల మేరకు రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని ప్రభుత్వశాఖలు ఏవైనా పథకాల యొక్క లబ్ధిదారులను గుర్తించుటకు ఆధార్ ఉపయోగించదలచినచో గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న UIDAI నుండి కావలసిన అనుమతులు పొందవలసి ఉన్నది.
దీనికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 43/2023 చట్టము కూడా తీసుకురావడము జరిగినది. అలాగునే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ITE&C డిపార్ట్మెంట్ వారు ఉత్తర్వులు తేది 21.05.2021 ద్వారా ఇదే విషయము తెలియజేస్తూ ప్రభుత్వ శాఖల వారు గెజిట్ పబ్లిష్ చేయ వలసినదిగా తెలియజేశారు. లేనియెడల, ఆధార్ సేవలలో అంతరాయం కలుగునని కూడా తెలియజేశారు. దీనికనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక శాఖలు ఆధార్ వినియోగించుటకు ఇదివరకే ఇవ్వడం జరిగినది. ఇటువంటి గెజిట్ గెజిట్ పబ్లికేషన్లు ఇదివరకే ఇవ్వటం జరిగింది
ఈ సందర్భంలోనే కమిషనర్, పాఠశాల విద్యాశాఖ వారి పరి వనలతో, పాఠశాల విద్యాశాఖ GO MS 29 తేది 09.07.2024 కూడా ఆధార్ వినియోగించుటకు గెజిట్ పబ్లికేషన్ ఇవ్వడం జరిగినది. ఇది కేవలం కేంద్ర ప్రభుత్వ ఆధార్ నిబంధనలకు అనుగుణంగా తీసుకున్న చర్య మాత్రమే.
Related News
” తల్లికి వందనం” పథకం సంబందించిన మార్గదర్శకాలు ప్రభుత్వం ఇంకనూ ఖరారు చేయవలసి ఉన్నది. పైన తెలిపిన GO MS 29 లో “తల్లికి వందనం” పధకమునకు సంబంధించి ఎటువంటి మార్గదర్శకాలు ఇవ్వబడలేదు. ఇది ఆధార్ నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రమే అని తెలియజేయడమైనది.
కానీ, కొన్ని వార్తా పత్రికలలో మరియు సామాజిక మాధ్యమాలలో ఈ జీవో ని చూపిస్తూ “తల్లికి వందనం” పథకం పేరిట తప్పుడు ప్రచారం జరుగుతున్నది. కాబట్టి అటువంటి వార్తలు అవాస్తవమని తెలియజేస్తూ, వాటిని నమ్మవద్దు అని తెలియజేయడమైనది.
“తల్లికి వందనం” పధకం మార్గదర్శకాలు మరియు విధివిదానాలు ప్రభుత్వం రూపొందించిన తరువాత తెలియజేయబడును. అప్పటివరకు ఎటువంటి అవాస్తవ కథనాలను నమ్మొద్దని కోరడమైనది.