2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్చి 1 నుండి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,535 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 1 నుండి 19 వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3 నుండి 20 వరకు ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు ఇప్పటికే విడుదల చేసింది. జనరల్ పరీక్షలు మార్చి 15న ముగుస్తాయి. ఫిబ్రవరి 5 నుండి జరుగుతున్న ప్రాక్టికల్ పరీక్షలు నేటితో ముగుస్తాయి. అయితే, దేశంలోనే తొలిసారిగా ఏపీ ప్రభుత్వం ‘మన మిత్ర’ పేరుతో ప్రయోగాత్మకంగా వాట్సాప్ గవర్నెన్స్‌ను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీ ఇంటర్ హాల్ టికెట్ 2025ను ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షలకు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించనున్నారు. నేటి నుంచి 9552300009 అనే వాట్సాప్ నంబర్ ద్వారా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ https://bie.ap.gov.in/ ద్వారా కూడా హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 10,58,893 మంది విద్యార్థులు హాజరుకానున్నారని ఇంటర్ బోర్డు తెలిపింది. వీరిలో 5,00,963 మంది మొదటి సంవత్సరం జనరల్ విద్యార్థులు, 44,581 మంది ఒకేషనల్ విద్యార్థులు. మొత్తం విద్యార్థులలో 4,71,021 మంది జనరల్ విద్యార్థులు, 42,328 మంది ఒకేషనల్ విద్యార్థులు. ఇంటర్ పరీక్షలకు నేటి నుంచి హాల్ టికెట్లను పంపిణీ చేయడానికి ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు గత సంవత్సరం అనుసరించిన విధానాలనే ఈసారి కూడా అమలు చేస్తామని బోర్డు పేర్కొంది. పరీక్షలు జరిగే అన్ని గదుల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.