ఇంటర్మీడియట్ విద్యలో నూతన సంస్కరణలు తీసుకొచ్చే దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది . వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్త నిర్ణయాలను అమలు చేయాలని అనుకుంటున్నారు.
పరీక్షవిధానం తో పాటు సిలబస్‌ను కూడా మార్చేందుకు కసరత్తు జరుగుతోంది. కొత్త సింగిల్ మార్క్ ప్రశ్నలను ప్రవేశపెట్టడాన్ని కూడా పరిశీలిస్తోంది.
తాజాగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యాశాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. ఇంటర్మీడియట్ విద్యలో కూడా సమూల మార్పులు తీసుకువస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మొదటి సంవత్సరంలోNCERT పుస్తకాలను ప్రవేశపెడతామని వెల్లడించారు. అకడమిక్ క్యాలెండర్, సిలబస్, ఉపాధ్యాయుల పని విభజన, పరీక్షల షెడ్యూల్, తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సమావేశం, ఉపాధ్యాయుల శిక్షణ, విద్యార్థుల హాజరు, విద్యార్థుల సామర్థ్యం పెంపుదల వంటి అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
Arts లో కొన్ని సబ్జెక్టులు మినహా పూర్తిగా NCERT సిలబస్ ఉండేటట్లు తెలుస్తోంది. సిలబస్ మాత్రమే కాకుండా పరీక్షా విధానంలో కూడా మార్పులు వస్తాయి.
ముఖ్యంగా మొదటి సంవత్సరంలో ఒక్క మార్కు ప్రశ్నలను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సైన్స్ గ్రూప్ సబ్జెక్టుల్లోనూ ప్రశ్నల సరళి మారే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నుంచి అన్ని సబ్జెక్టుల్లో 1, 2, 4, 8 మార్కుల ప్రశ్నలు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. ఆర్ట్స్ సబ్జెక్ట్ పరీక్షల్లోనూ మార్పులు ఉంటాయి. త్వరలోనే దీనికి సంబంధించి మరింత క్లారిటీ రానుంది.
ఉచిత శిక్షణ:
మరోవైపు విద్యార్థులకు ఏపీ ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులకు ఉచితంగా ఐఐటీ, నీట్ కోచింగ్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని నాలుగు ప్రధాన పట్టణాల్లో ఈ శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి వాటి పరిధిలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.
అయితే ముందుగా ఎంపిక చేసిన కాలేజీల్లో… జూనియర్ లెక్చరర్లు విద్యార్థులకు ఐఐటీ శిక్షణ ఇచ్చేవారు. ఈసారి నారాయణ కాలేజీలకు చెందిన ఐఐటీ, నీట్ సిలబస్‌లోని టీచింగ్ స్టాఫ్‌తో ఈ శిక్షణ ఇవ్వాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
ముందుగా ఈ 4 కాలేజీల్లో…
మొదటి దశలో గుంటూరు, కర్నూలు, నెల్లూరు, విశాఖపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, ఈ నగరాలకు 5 లేదా 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రభుత్వ కళాశాలల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించనున్నారు.
ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు నారాయణ సిబ్బంది ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఉచితంగా నీట్, ఐఐటీ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ పరీక్షలో ఎంపికైన విద్యార్థులు ఇంటర్-రెగ్యులర్ తరగతులతో పాటు IIT మరియు NEET శిక్షణను నిర్దేశించిన కేంద్రంలో పొందుతారు.
ప్రత్యేక కేంద్రాల్లో శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఆన్‌లైన్‌లో హాజరు నమోదు చేస్తారు. దీంతో అటెండెన్స్‌కు ఇబ్బంది లేకుండా ఉండాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. గతంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఇంటర్ బోర్డు నీట్, ఐఐటీ శిక్షణ కూడా ఇదే తరహాలో ఇచ్చింది. ఆసక్తిగల ప్రభుత్వ లెక్చరర్లతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. కానీ ఈ పద్ధతి పెద్దగా ఫలితాలు ఇవ్వకపోవడంతో ఈ ఏడాది శిక్షణ పద్ధతిని మార్చారు. నారాయణ విద్యా సంస్థాన్ సిబ్బంది ఆసక్తిగల విద్యార్థులకు ప్రవేశ పరీక్షను నిర్వహిస్తారు మరియు ఎంపికైన వారికి IIT మరియు NEET కోచింగ్‌లను అందిస్తారు.