తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) పాలక మండళ్ల పదవీకాలాన్ని పొడిగిస్తూ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాల పదవీకాలాన్ని, 9 డీసీసీబీ ఛైర్మన్ల పదవీకాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయా పాలక మండళ్ల పదవీకాలానికి ఆరు నెలల ముందు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన వెలువడలేదు. రేపటితో ముగియనున్న ప్రస్తుత పాలక మండళ్ల పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
అయితే, స్థానిక ఎన్నికల తర్వాతే ఈ సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. పదవీకాలాన్ని పొడిగిస్తూ జీవో జారీ చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు పాలక మండళ్లు, డీసీసీబీ ఛైర్మన్లు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.