Coconut Water: కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా వస్తాయో తెలుసా ?

కొబ్బరి బోండంలోకి నీళ్లు ఎలా వస్తాయి? కొబ్బరికాయను పగులకొట్టగానే అందులోని నీళ్లు చూసి ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఇందులోకి నీళ్లెలా వచ్చాయనే ప్రశ్న మీకు తట్టిందా? తెలుసుకుందాం ..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

చెట్టుపై ఎక్కడో ఎత్తులో కాసే కొబ్బరి బోండంలోకి తియ్యగా, చల్లగా ఉండే నీళ్లు ఎలా వస్తాయి? వేసవిలో మన దాహార్తిని తీర్చి, వెంటనే శక్తిని అందించే పోషకాలు కొబ్బరి బోండంలో ఉంటాయి. ఆకుపచ్చని రంగులో లేతగా ఉండే కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది. ముదిరిన తర్వాత గోధుమ రంగులోకి మారిన కొబ్బరి బోండంలో తక్కువ నీళ్లు ఎక్కువ గుజ్జు ఉంటాయి. మరి, కొబ్బరికాయలో నీళ్లు ఎలా నిల్వ ఉంటాయి, ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి.

కొబ్బరికాయ నిర్మాణం:

Related News

కొబ్బరి చెట్టును ‘ట్రీ ఆఫ్ లైఫ్’ అని పిలుస్తారు. ఎందుకంటే కొబ్బరి చెట్టులోని ప్రతీ భాగం మనకు ఏదో ఒక విధంగా పనికొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణ మండల ప్రాంతాలు, దేశాల్లో కొబ్బరి చెట్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొబ్బరి బోండంలో నీళ్లు ఎలా తయారవుతాయో అర్థం చేసుకోవడానికి ముందు దాని నిర్మాణం గురించి తెలుసుకోవాలి. కొబ్బరికాయలో ఎక్సోకార్ప్, మీసోకార్ప్, ఎండోకార్ప్ అని పిలిచే మూడు పొరలు ఉంటాయి. ఎక్సోకార్ప్ అంటే కొబ్బరికాయ పైపొర. ఇది ఆకుపచ్చని రంగులో మెత్తగా ఉంటుంది. ఆకుపచ్చని పొర కింద పీచులా ఉండే పొట్టును మీసోకార్ప్ అంటారు. ఎండోకార్ప్ అంటే కొబ్బరి టెంక. లోపలి తెల్లని గుజ్జు (కొబ్బరి)ను ఎండోకార్ప్ రక్షిస్తుంది. ఎండోకార్ప్‌లో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి గుజ్జు. దీన్ని ఎండోస్పెర్మ్ అని పిలుస్తారు. లేత కొబ్బరికాయలో మృదువుగా జెల్లీలా ఉండే ఈ గుజ్జు, కాయ ముదిరినకొద్దీ గట్టి పడుతుంది. రెండోది టెంకలో ఉండే నీరు. కొబ్బరికాయ ఎదిగే (అభివృద్ధి) క్రమంలో టెంకలో సహజంగానే నీరు ఏర్పడుతుంది.

టెంకలోకి నీరు ఎలా వస్తుంది?:

కొబ్బరి నీరు ఒక వడకట్టిన ద్రవం అని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అనుబంధ సంస్థ నేషనల్ సెంటర్ ఆఫ్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్‌లోని ఒక అధ్యయనం చెబుతోంది. చెట్టులోని వాస్క్యులర్ వ్యవస్థ (నీరు, పోషకాలను రవాణా చేసే వ్యవస్థ) ద్వారా వేళ్ల నుంచి కాయలోకి నీరు వెళ్తుందని ఆ అధ్యయనం పేర్కొంది. నీటి రవాణాలో ముఖ్యంగా చెట్టులోని జైలమ్ నాళాలు కీలక పాత్ర పోషిస్తాయి. కొబ్బరి బోండంలో నీరు తయారయ్యే విధానాన్ని ఈ అధ్యయనం వివరించింది. కొబ్బరి చెట్టు వేళ్లు దాదాపు 1 నుంచి 5 మీటర్ల లోతు వరకు భూమిలోకి వ్యాపించి ఉంటాయి. ఈ వేళ్లు చుట్టుపక్కల నేల నుంచి పోషకాలతో కూడిన భూగర్భజలాలను గ్రహిస్తాయి. తర్వాత ఈ నీరు కాండం ద్వారా పైకి రవాణా అవుతుంది. చివరకు కొబ్బరికాయలోకి చేరుతుంది. కొబ్బరికాయలోని టెంక భాగం అంటే ఎండోకార్ప్ నిర్మాణం ఈ నీటిని నిల్వ చేస్తుంది. పోషకాలు సమృద్ధిగా ఉండే ఈ నీరు, కాయ ముదిరేకొద్దీ తెల్లటి గుజ్జు (కొబ్బరి)ను తయారు చేస్తుంది. ఇలా కొబ్బరి నీళ్లు, చెట్టులో సహజంగా తయారవుతాయి.

కొబ్బరి నీళ్లలో ఏం ఉంటాయి?:

కొబ్బరి నీళ్లలో దాదాపు 95 శాతం మామూలు నీళ్లే ఉంటాయి. అందుకే శరీరాన్ని హైడ్రేట్ చేసే అద్భుత ద్రవంగా కొబ్బరి నీళ్లను పరిగణిస్తారు. మిగతా 5 శాతం కొబ్బరి నీళ్లలో మనకు ఎంతో పనికొచ్చే పోషకాలు ఉంటాయి. కొబ్బరి నీటిలో ఉండే సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం వంటి ఖనిజాలు నరాలు, కండరాలకు పుష్టిని ఇస్తాయి. అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌ల వంటి ప్రోటీన్లు జీవక్రియకు సహాయపడతాయి. ఫ్రక్టోజ్, గ్లూకోజ్ వంటి చక్కెర పదార్థాలు నీటికి తియ్యని రుచిని అందిస్తాయి. అంతేకాకుండా విటమిన్ సి, మిటమిన్ బి కూడా ఉంటాయి.

కొబ్బరి బోండంలో ఎన్ని నీళ్లు ఉంటాయి?:

కొబ్బరికాయలోని నీటి పరిమాణాన్ని, నాణ్యతను చాలా అంశాలు ప్రభావితం చేస్తాయి. వాటిలో కొబ్బరికాయ వయస్సు ఒకటి. లేతగా, ఆకుపచ్చ రంగులో ఉండే కొబ్బరికాయలో నిండుగా నీళ్లు ఉంటాయి. ఆరు నుంచి ఎనిమిది నెలల వయస్సున్న కొబ్బరి కాయలను లేత కొబ్బరిగా పరిగణిస్తారు. వీటిలో 300 మి.లీ నుంచి ఒక లీటర్ వరకు నీళ్లు ఉంటాయి. ముదిరిన కొబ్బరి అంటే 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున్న కొబ్బరిలో తక్కువ నీరు ఉంటుంది. ఎందుకంటే తెల్లటి గుజ్జు (ఎండోస్పెర్మ్) ఈ నీటిని పీల్చుకుంటుంది.

వర్షపాతం కూడా ఇందులో పాత్ర పోషిస్తుంది. ఎక్కువ వానలు పడితే కొబ్బరిలో నీరు ఎక్కువ చేరుతుంది. కరవు పరిస్థితుల్లో పెరిగే కొబ్బరి చెట్లలో కాయ వరకు చేరే నీటి శాతం తక్కువగా ఉండటం వల్ల అందులో నీళ్లు తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఖనిజాలతో నిండిన నేలల్లో పెరిగిన చెట్లలో అత్యధిక నాణ్యత, పోషకాలు సమృద్ధిగా ఉండే నీళ్లు చేరతాయి.

సారం లేని నేలలు, చెట్టు మొదలు నుంచి కాయ వరకు ప్రయాణించగల ఖనిజ లవణాలు లేకపోతే ఆ నీటి నాణ్యత తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరంగా, జబ్బు పడిన చెట్లకు చిన్న కాయలు కాస్తాయి. వాటిలో చాలా తక్కువ నీరు ఉంటుంది. నేలను పరీక్షించడం, సేంద్రీయ ఎరువులు వాడటం వంటి సుస్థిర వ్యవసాయ విధానాలను పాటించడం ద్వారా కొబ్బరి చెట్లలో పోషకాలను కాపాడవచ్చు. తద్వారా నాణ్యమైన కొబ్బరి నీళ్లను పొందవచ్చు.