బలహీనమైన డిమాండ్ కారణంగా దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమలో రిటైల్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో మొత్తం వాహన అమ్మకాలు 7 శాతం తగ్గాయని డీలర్ల సంఘం FADA గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఎందుకంటే ప్రయాణీకుల వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాల అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి. FADA డేటా ప్రకారం.. గత నెలలో మొత్తం 18,99,196 వాహనాలు అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో నమోదైన 20,46,328 యూనిట్లతో పోలిస్తే ఇది 7 శాతం తగ్గుదల. అన్ని విభాగాలలో అమ్మకాలు తగ్గాయని FADA అధ్యక్షుడు CS విఘ్నేశ్వర్ తెలిపారు. సమీక్షలో ఉన్న నెలలో ప్రయాణీకుల వాహనాలు 10 శాతం తగ్గి 3.03 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి.
ద్విచక్ర వాహనాల విభాగంలో అమ్మకాలు 6 శాతం, వాణిజ్య వాహనాలు 9 శాతం, ట్రాక్టర్ అమ్మకాలు 14.5 శాతం తగ్గాయి. అమ్మకాల పతనం కారణంగా.. ప్రస్తుత నెలలో నిల్వలు భారీగా ఉంటాయని డీలర్లు ఆందోళన చెందుతున్నారు. నిల్వలు ఇప్పటికే 50-52 రోజులకు పెరిగాయని వారు చెప్పారు. ఇన్వెంటరీలు అంటే తయారీ వాహనాలు అమ్ముడుపోకుండా డీలర్ల వద్ద ఉండే కాలం. ధరల సర్దుబాట్లు, బలహీనమైన కస్టమర్ సెంటిమెంట్, కఠినమైన ఆర్థిక నిబంధనలు వంటి సమస్యలను పరిష్కరించడం ద్వారా కంపెనీలు అమ్మకాలను పెంచడానికి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.