తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి వెనుకాడుతున్నారు. రంజాన్ పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉర్దూ విద్యార్థులకు ఇప్పటికే ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. వచ్చే వారంలో అన్ని పాఠశాలలకు ఒంటిపూట బడులు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మార్చి ప్రారంభానికి ముందు నుంచే ఎండలు మండిపోతున్నాయి.
ఈ ఏడాది ఎండలు తీవ్రంగా ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో మార్చి 15 నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థల్లో ఒంటిపూట బడులు నిర్వహించనున్నారు. ఈ విషయంలో పాఠశాల విద్యా శాఖ ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేసింది.
అయితే ఎండలు పెరుగుతున్నందున, మార్చి మొదటి వారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు. దీంతో మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈసారి ఎండలు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తోంది. మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని, వేడిగాలులు కూడా తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు వీలైనంత త్వరగా ఒంటిపూట బడులు ప్రారంభించాలని యోచిస్తున్నాయి.
Related News
గత సంవత్సరం, మార్చి 18 నుండి ఏపీలో ఒంటిపూట బడులు ప్రారంభమయ్యాయి. అయితే, ఈసారి మార్చి 15 నుండి ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వస్తే, 1 నుండి 9 తరగతి వరకు ఒంటిపూట బడులు జరుగుతాయి. దీనితో, ఉదయం 7.45 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మాత్రమే తరగతులు జరుగుతాయి.