ఏపీలోని అన్నమయ్య జిల్లా గుండాలకోనలో జరిగిన ఏనుగు దాడిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను అటవీ శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆయన వైద్యులకు సూచించారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షలు, గాయపడిన వారికి రూ. 5 లక్షలు పరిహారంగా అందిస్తామని కూడా ప్రకటించారు. తరువాత మహా శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని దేవాలయాలను సందర్శించే భక్తులకు తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అలాగే, ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను పరామర్శించి వారికి ధైర్యం చెప్పాలని స్థానిక ఎమ్మెల్యేలకు సూచించారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటానని సీఎం ప్రకటించారు.
శివరాత్రి సందర్భంగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం గుండ్లకోనలోని శివాలయానికి భక్తులు పోటెత్తారు. సోమవారం రాత్రి 14 మంది భక్తులు అటవీ మార్గంలో నడుచుకుంటూ వెళుతుండగా ఏనుగుల గుంపు దాడి చేసింది. ఈ సంఘటనలో ఐదుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. మృతులు ఉర్లగడ్డ పోడు గ్రామ వాసులుగా గుర్తించారు. 8 మంది భక్తులు దాడి నుంచి బయటపడ్డారు.