ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ శుభవార్త అందించింది. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10వ తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అంటే Tenth ఫలితాలు ఏప్రిల్ 25 మరియు 30 మధ్య ప్రకటించబడతాయి. ఫలితాల ప్రకటన తర్వాత, విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేసి, SSC బోర్డు యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను తనిఖీ చేయవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల అధికారిక విభాగాలు వెల్లడించాయి. గత ఏడాది మే 6న 10వ తరగతి ఫలితాలు వెలువడ్డాయని, ఈ ఏడాది ముందుగానే ఫలితాలు ప్రకటిస్తామని డైరెక్టర్ దేవానంద్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలు పరీక్షా కేంద్రాల్లో మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఈ వార్షిక పరీక్షలకు 6,30,633 మంది విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్రంలో 3473 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రక్రియ ముగిసిన వెంటనే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభించి ఏప్రిల్ 8 నాటికి పూర్తి చేసి.. మూల్యాంకనం చేసిన జవాబు పత్రాలను మరోసారి పరిశీలించి.. ఆన్‌లైన్‌లో మార్కుల నమోదు, కంప్యూటరీకరణ ప్రక్రియ చేపట్టారు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి మరో వారం పట్టే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు కూడా ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి. ఇప్పటికే పదో తరగతి బోర్డు అధికారులు ఏప్రిల్ చివరి వారంలో ఫలితాలు ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల సంఘం నుంచి అనుమతి రావడంలో జాప్యం జరిగితే మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫలితాల విడుదల వెబ్‌సైట్‌లో ఫలితాలను చూసేందుకు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫలితాలతోపాటు మార్కుల మెమో కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు తాము చదివిన పాఠశాలల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్లను పొందవచ్చు. కానీ మార్కు షీట్‌లో గ్రేడ్‌లు మాత్రమే ఉంటాయి. ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయన్న వివరాలు అందులో లేవని బోర్డు పేర్కొంది.