“తంగలాన్” మూవీ రివ్యూ – Thangalaan Review in Telugu

హిందుత్వ జపం చేస్తూ, ఆ రకం సినిమాలు వరసగా వరదలా తీస్తున్న ఈ సందర్భంలో ‘తంగలాన్’ బాంబ్ షెల్ లా వచ్చిపడింది.
* Taadi Prakash

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

వాళ్ళు- పేదవాళ్ళు, కూటికి గతి లేని వాళ్ళు, మూల వాసులు,దళితులు,ఎండుగడ్డి పోచలు, మొలకు గోచీల వాళ్ళు… భార్యల్తో బిడ్డల్తో అరణ్యాల్లో నడుస్తూ… బంగారం అనే అంతుచిక్కని ఐశ్వర్యం వేటకు బయల్దేరుతారు. అటు ఒక పసిడి భూతం ఈ దరిద్రులను వెన్నాడుతూ వుంటుంది. ఇది ఒక పురాతన జానపద గాథ. నెత్తురూ కన్నీళ్ళూ కలిసి ప్రవహించిన కథ. ఆధునిక కేమెరాలతో, అరుదైన సాంకేతిక పరిజ్ఞానంతో వందల ఏళ్ళ క్రితం జరిగిన ఒక ఘాతుకాన్ని అంతే క్రూరంగా చూపించిన సాహసం పేరు- తంగలాన్!

కొన్ని నిజజీవిత సంఘటనలు, కొంత కల్పన, పేదల వేదన కలిసిన తిరుగుబాటు సిద్ధాంతం- తంగలాన్.

పార్వెట్ట చూశారా? కాలా చూసే వుంటారు. ఇప్పుడు… తంగలాన్! వీటిని తీసిన పారంజిత్ అనేవాడు మామూలు మనిషి కాదు. మహాదర్శకుడు. కన్నీటి కావ్యామృత రసావిష్కరణ తెలిసిన మాంత్రికుడు. మన కాలం వీరుడు. ‘నేను అంబేద్కరిస్ట్ ని’అని ప్రకటించుకున్న రంజిత్, రొటీన్ రొడ్డకొట్టుడు చిల్లర ప్రచార సినిమాలు తీయడు. అతని ఆవేశానికో అర్థం వుంది. అతని ఆగ్రహానికో పద్ధతి వుంది. అతని తిరుగుబాటుకో లక్ష్యముంది. తంగలాన్ తీయడం వెనుక వున్నది పరిశోధన, కమర్షియల్ ప్లాన్ మాత్రమే కాదు. అదొక తపస్సు. చెక్కుచెదరని నిబద్ధత. ఒక సూపర్ హీరోకి గోచీ పెట్టి దుర్గమారణ్యాల్లో నడిపించిన దుస్సాహసం!

కోలార్ బంగారు గనుల్ని మొట్టమొదట కనిపెట్టడానికి జరిగిన సాహస యాత్రలో చరిత్ర చూసిన కన్నీళ్ళనీ, రక్తపుటేర్లనీ, వీరుల చావునీ, ఆడవాళ్ళ నిస్సహాయతనీ వొళ్ళు జలదరించేలా రికార్డు చేయడంలోని నిజాయితీ మనల్ని షాక్ చేస్తుంది. అటు అగ్రవర్ణ బ్రాహ్మణ దురహంకారం, ఇటు హృదయం లేని బ్రిటిష్ పాలకుల దౌర్జన్యం. దళిత బహుజనులకు వెనక తుపాకులూ,
ముందు మొనదేలిన ఈటెలూ…

బంగారం ఒక తీరని దాహం. దురాశ.
ఇటు నిరుపేద తల్లుల బిడ్డల ఆకలి!
ఇలాంటి ఒక మానవ మహావిషాదాన్ని డాక్యుమెంటరీగా తీస్తే చాలదు. నీరసంగా నడిచే కళాత్మక చిత్రంగా తీసినా కుదరదు. ఎఫెక్టివ్ గా చెప్పాలంటే, కమర్షియల్ స్కీమ్ తోనే కొట్టాలి…. బలమైన బ్లాక్ బస్టర్ టెక్నిక్ తోనే చెలరేగిపోవాలి. ఆ ఎత్తుగడ ఫలించింది. పారంజిత్ గెలిచాడు. బీభత్సరస ప్రధానమైన ఒక చారిత్రక విషాదాన్ని మన కళ్ళముందు పరిచాడు.

‘చియాన్’విక్రమ్ ఒక మార్మిక శక్తిగా మారి ముందుండి ఈ సినిమాని నడిపించాడు.
‘సేతు’ చిత్రంలో చియాన్ పేరుతో విక్రమ్ పాపులర్ అయ్యాడు. అదే తెలుగులో శేషు. హిందీలో తేరే నామ్. విక్రమ్ దిక్కులేని దరిద్రుడిగా, ధైర్యవంతుడిగా, పేదరికానికి పుట్టిన మానవమృగంలా, ఇంగితం వున్న మూలవాసుల నాయకుడిగా, బానిస బంధనాల్ని తెంచుకున్న విముక్తి పోరాట యోధుడిగా ప్రతిఒక్కర్నీ మెప్పించాడు. పాత్రలో అంత సహజంగా ఇమిడిపోవడంలో వున్న శ్రమ, కళ పట్ల అతనికి వున్న అపారమైన ప్రేమ వెలకట్టలేనివి.

విక్రమ్ భార్యగా, ముగ్గురు బిడ్డల తల్లిగా, కొద్దిపాటి ఆనందాన్ని, పెనువిషాదాన్నీ అలవోకగా పండించిన మలయాళ నటి పార్వతీ తిరువొత్తుని మనం ఎప్పటికీ మరచిపోలేం.
నల్లగా నిగనిగలాడిన మరో పేదరాలు, తమిళ నటి ప్రీతీ కరణ్ పాత్ర ఔచిత్యానికి పర్యాయపదంగా మనసు దోచుకుంటుంది. ఆ అంటరాని మారుమూల పల్లెలో, వూసినా, దుమ్మెత్తిపోసినా చలనం లేని కటిక దరిద్రపు బతుకులు వాళ్ళవి.
ఆ గ్రామంలో ఏ ఆడదీ జాకెట్టు వేసుకోదు. బిడ్డల ఆకలి తీర్చడమే అలవికాని పని… అక్కడ జాకెట్లకీ, షోకులకీ ఆవగింజంత అవకాశమూ లేని పాడుకాలం అది. “వొరేయ్ పనికిమాలినోడా, నాకో జాకెట్ తెచ్చిస్తావా?”అని మొగుడు విక్రమ్ ని అడుగుతుంది పార్వతి. ఒక పోరాటంలో గెలిచి, బ్రిటిష్ దొరల మెప్పు పొందిన తంగలాన్ బోలెడన్ని జాకెట్లు పట్టుకుని ఇంటికి వస్తాడు. అప్పుడు చూడాలి పార్వతి బుగ్గల్లోంచి ఉబికి వచ్చే ఆనందం. ఆడాళ్ళందరూ జాకెట్లు వేసుకుని మురిసిపోతుంటారు.

అప్పుడు మొదలవుతుంది ఒక సెలబ్రేషన్… ఒక బృందగానం, ఒక గిరిజన నృత్య కోలాహలం.
ఆ హొయలు.. ఆ తూగు.. ఆ జీవన సౌందర్యం పూలతీగలా మనల్ని చుట్టుకునే పరిమళం.

పార్వతీ, ప్రీతీ- ఇద్దరిదీ మనోహరమైన చిరునవ్వు. ఫోటోగ్రాఫరూ, పారంజిత్ ఏమైపోయారో గానీ, జనం మాత్రం పరవశించి చిత్తై, చచ్చి సున్నమైపోతారు. దర్శకుడి మీద ఎంత గౌరవం కలిగిందంటే, వాళ్ళెవరికీ… కొన్ని డజన్ల మంది ఆడవాళ్ళకి రవికెలు వుండవు కదా, ఐనా, ఒక్కసారి కూడా, ఒక్క స్త్రీని కూడా అశ్లీలంగా చూపించే పని చేయలేదు.

బుద్ధ జాతక కథల్లోని ‘హారతి’, ఈ సినిమాలో బంగారాన్ని, ప్రాణాలకు తెగించి రక్షించే వనదేవతగా వుంటుంది. ఆనాటి మూఢ నమ్మకాలకూ, భయాలకూ, అపోహలకూ ప్రతీకగా ఒక సర్రియలిస్ట్ నేరేటివ్ పవర్ తో, గావు కేకలు పెట్టి, నెత్తురు కళ్ళజూసే గిరిజన దేవతగా మాళవికా మోహనన్ అనే గ్లామర్ స్టార్ మూలవాసుల్నీ, ప్రేక్షకుల్నీ భయకంపితుల్ని చేస్తుంది. ఇదో పవర్ఫుల్ క్రియేటివ్ టెక్నిక్.

తంగలాన్ కి పీడకలలు వస్తుంటాయి. తాత చెప్పిన పురాతన గాథల్లోని ఆపదలూ, అపశకునాలూ అతన్ని వొణికిస్తుంటాయి. చూసేవాళ్ళకి విభ్రాంతి కలిగేలా ఈ కలల్ని మేజికల్ రియలిజంలా ఒక మాయలా, మార్మికంగా చేసిన విజువల్ ప్రెజెంటేషన్- పారంజిత్ కి మహా రచయిత గాబ్రియల్ గార్షియా మార్క్వెజ్ పూనాడా అని అనిపిస్తుంది. ఇది సామాన్య ప్రేక్షకుడికి కనక్ట్ కావడం కష్టమే! ఎవర్ని ఎవరు చంపుతున్నారో తెలియని ఒక ఉన్మాదం లాంటి కేయాస్ ని అద్భుతంగా చూపగలిగిన జీనియస్ రంజిత్. తంగలాన్ లో కొన్ని లోపాలు వున్నాయని చెప్పవచ్చు. ఐతే, బాధితుల పక్షాన నిలిచిన పారంజిత్ కమిట్ మెంట్ ముందు, సముద్ర కెరటాల్లా విరుచుకుపడిన సృజనాత్మక తిరుగుబాటు ముందు, చీకటిలో వెలిగించిన ఆశాదీపాల కాంతి ముందు అవి వెలవెలబోతాయి.

అడవిలో, కొండ దగ్గర చటుక్కున ఒక నెమలి ఎగిరి రెండు మూడుచోట్ల వాలుతుంది. అక్కడ బంగారం వుంటుందని అర్థమైపోతుంది. నెమళ్ళకి బంగారం ఎక్కడ వుందో పసిగట్టే శక్తి వుందో లేదో మనకి తెలీదు గానీ, చూడ్డానికి అదెంతో బావుంది. కొండల్లో నిక్షిప్తమై వున్న బంగారాన్ని కాపాడే విషసర్పాలు వందల్లో జరజరా పాకి వచ్చి దాడి చేస్తాయి. ఎగిరి దూకిన ఒక నల్లచిరుత హఠాత్తుగా వూడిపడుతుంది. మరోచోట కత్తివేటుకు కొండదేవత పొట్ట చీరుకుపోయి నెత్తురు ధారలై పారుతుంది. కొద్దిసేపటికి ఆ ప్రాంతం అంతా బంగారం మిలమిలా మెరుస్తుంది. ఇలాంటి మేజికల్ సన్నివేశాలు వూపిరి సలపనివ్వవు. టిప్పుసుల్తాన్ నిరాశతో వెనుతిరిగిన కొండల్లో, లోతైన బావుల్లో, ప్రాణాలకి తెగించి పోరాడినా చేతికి దొరకని బంగారం… దళిత బహుజనుల చీకటి జీవితాన్ని మార్చివేసే ఆ పసిడి వెన్నెల కాంతిని వాళ్ళు చూడగలుగుతారా? ఆ అడివిబిడ్డల ఆకలి తీరుతుందా?

హృదయాన్ని కదిలించే సంగీతం మనల్ని కుర్చీలో కూర్చోనివ్వదు. కళాత్మకమైన ఫోటోగ్రఫీ మనశ్శాంతిని మిగల్చదు. బ్రాహ్మల మీదా, బ్రిటిష్ వాళ్ళ మీదా ఎండు గడ్డిపోచల్లాంటి, దరిద్రదేవత బిడ్డలు దళితులు విజయం సాధించేదాకా పారంజిత్ ఊరుకోడు.

చరిత్ర కొంచెం తెలిసివుంటే ఈ సినిమా విలువ ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది.

శిస్తు కట్టలేదనే నెపంతో దళితుల భూముల్లో వాళ్ళనే కట్టుబానిసల్ని చేసి, వెట్టిచాకిరీ చేయించే రాక్షసత్వం మీద తిరుగుబాటే తంగలాన్. సాహసించి, తెగించి, ప్రాణాలు వొడ్డి పోరాడి
తన నేలతల్లిని తాను సాధించుకుంటాడు. ఆధిపత్యం తలకెక్కిన దొరలు దిగివచ్చి ‘పత్రాలు’ యిచ్చేస్తారు. వెండితెర నిండుగా పరుచుకున్న తన సొంత పొలంలో మట్టిపెళ్ళల మీద గుండె నిండిన సంతోషంతో విక్రమ్ వెల్లకిలా పడుకుంటాడు. సంగీతం మనల్ని వెన్నాడుతుంది. కళ్ళలో నీళ్ళు తిరిగే సన్నివేశం యిది.

ఇది భూమి సమస్య. బతుకు సమస్య. మూలవాసులకు చావోరేవో తేల్చుకునే విషమ సమస్య. ఆ బాధని గుండెలవిసిపోయేలా చిత్రీకరించగలగటం ఈ దర్శకుడు సాధించిన విజయం. బంగారంతో పాటు చరిత్రనీ తవ్వి తీయగలిగాడు.

2024లో నిస్సందేహంగా ఉత్తమ జాతీయ చిత్రం ‘తంగలాన్’. మరో అరడజను అవార్డులు ఎలాగూ వస్తాయి.

ఇంతకీ మన సంగతే౦టో..!

అదేంటి… తెలుగులో ఇలాంటి సినిమాలు తీయగలిగే మొనగాడే లేడా? అని మనం ఆశ్చర్యపోవడం శుద్ధ దండగ. మనం హేపీగా, నిష్పూచీగా, గుంపులు గుంపులుగా ‘మిస్టర్ బచ్చన్’ సినిమాకో, ‘డబుల్ ఇస్మార్ట్’కో ఎగురుకుంటూ వెళదాం. డప్పులు కొడదాం. రంగుల కాగితాలు ఎగరేద్దాం. అభిమాన హీరో కటౌట్లకి పాలాభిషేకాలు చేద్దాం. పువ్వులు విసురుదాం, గంతులు వేద్దాం… మన తెలుగు పైశాచిక స్వర్గంలో!

దిక్కుమాలిన అలగాజనం గురించి ఆవేశపడిపోతూ తీసే తంగలాన్ లాంటి బుద్ధిలేని సినిమాలు చూసి హేళనగా నవ్వుకుందాం.
జై తెలుగు సినిమా.

కొసమెరుపు: హిందుత్వ జపం చేస్తూ, ఆ రకం సినిమాలు వరసగా వరదలా తీస్తున్న ఈ సందర్భంలో ‘తంగలాన్’ బాంబ్ షెల్ లా వచ్చిపడింది. “What an impeccable timing your majesty”- Lion King లో ఫేమస్ డైలాగ్.

– తాడి ప్రకాశ్

‘Indus Martin’ about Thangalan Movie

తంగులానందలహరి
——————
తంగలాన్ విజయాన్నీ, దానిలో చర్చించిన విషయాన్నీ జీర్ణించుకోలేని సవర్ణ అభ్యుదయం ఆఖరి ప్రయత్నంగా చేసే వ్యాఖ్య : అబ్బా చియాన్ విక్రం నటన అదిరిపోయింది. కథలో తికమక చాలా ఉన్నప్పటికీ మొత్తం సినిమాకి ప్రాణం పోశాడు. హ్యాట్సాఫ్ టు విక్రం”.

కులతత్వానికి కళామతల్లి పైటను ముసుగుగా కప్పుకునే జనాలకు వూపిరాడటంలేదు. ఎలాగైనా సినిమాలో బొక్కలు వెతకాలని వాళ్ళ మనసు చేసే తొందర వాళ్ళకు నిద్రపట్టనియ్యటంలేదు.

‘తెలుగులో ఇలాంటి సినిమా తీస్తే జనాలు చూడరు ‘ అని కూడా వాళ్ళే ముందస్తు ముళ్ళకంచెలు నిర్మించి వదిలారు. తమిళం డబ్బింగు సినిమాలైన పరియేరుం పెరుమాళ్, సారపట్ట, కాలా, కబాలీ, అసురన్, కర్ణన్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎగబడి చూడలేదా? స్ట్రైట్ గా తెలుగులో ఆ సబ్జెక్టులను తీస్తే ఎందుకు చూడరూ? చూడరనే నెరేటివ్ ను ముందుగానే బిల్డ్ చేసి అలాంటి సంబెక్టు తెలుగులో రాకుండా చూసే వాచ్ డాగ్స్ ఉద్యోగం వీళ్ళది.

జై భీం సినిమా బాగుంది కానీ ఆ పేరు పెట్టడమే బాలేదన్న అభ్యుదయం తెలుగు జనాలది. పేర్ల చివర ‘ చే ‘ , ప్రొఫైల్ పిక్చర్లో బాబ్ మార్లే బొమ్మలైనా పెట్టుకుంటారు, ఖరీదుపోసి కమ్యూనిస్టు మ్యానిఫెస్టో పుస్తకాలైనా కొని షెల్ఫుల్లో పెట్టుకుంటారు. కానీ ‘ జై భీం ‘ టైటిల్లో మాత్రం ఏదో అనాగరికతా, జుగుప్సూ ఫీల్ అవుతారు.

తంగలాన్ సినిమా మొత్తం అర్ధంకాకుండా ఏదో ప్రతీకాత్మకంగా ఉందనే జనాలకు మహాభారతనంలోని అశ్వద్దామ పాత్ర కొనసాగింపుగా తీసిన కల్కి అనే సై ఫై (?) సినిమా మాత్రం మహాబాగా అర్ధం అవుతుంది. వాళ్ళకు అక్షరం ముక్క మళయాళం తెలియకపోయినా ఓటీటీలో మళయాళీ సినిమాలు చూడటం మాత్రం స్టేటస్ సింబల్. ఎవరికీ తెలియని మళయాళీ నటీనటుల పేర్లను కోట్ చేస్తూ వాటిమీద రివ్యూలు రాయడం వారి ‘ అప్పర్ క్లాస్ ‘ కళాభిమానానికి అలంకారం.

ఇక తంగలాన్ సబ్జెక్ట్ చూసీ, అందులోని పీడక మతానికి అతనిచ్చిన ట్రీట్మెంట్ చూసీ అతన్ని ఎలాగైనా బద్నాం చెయ్యాల్ని ప్రయత్నించే లో గ్రేడ్ ఆర్ట్ లవర్స్ చేసే కామెంట్లైతే కళ్ళు బైర్లు కమ్మిస్తున్నాయి.

‘విక్రం గాడి అసలు పేరు కెన్నెడీ జాన్ విక్టర్. వాడొక గొర్రెమతం మనిషి, పా. రంజిత్ పేరులో ‘ పా ‘ అంటే ఏమిటీ? వాడి తమ్ముడీ పేరు ప్రభు (వికీపీడీయా పీడకులు), అంటే వీడు కూడా అదే ఎడారి బాపతు ‘ అని గుడ్డలిప్పుకుని ట్విట్టర్లో ఫేస్బుక్కులో నంగా నాచ్ చేస్తున్న మతస్తుల యాతన ఆ వెంకటేసుడికి కూడా తెలియదు.

కథను మర్మంగా చెబితే క్లారిటీ లేదు, To show is better than to tell , అనే జనాలకు చేతులెత్తి మొక్కాలి. మొత్తం సినిమా దృశ్యంగానే తీసి చెబితే వీళ్ళే మూడుగంటల సినిమా ఎవడు చూస్తాడు అని నిడివి మీదా నీలుగుతారు.

భారత సమాజానికి, మరీ ముఖ్యంగా తెలుగు సమాజానికి పట్టిన వ్యాధిపేరు హిపోక్రసీ. వీళ్ళ సాహిత్య, కళాభిమానం కూడా ఈ విషాన్ని దోసిళ్ళతో తాగిస్తూనే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు మీరు వాళ్ళకు సత్యం చెప్పే ప్రయత్నం చేసినా, వాళ్ళు మాత్రం కులం, మతం అనే రెండు విషయాలకు వచ్చేటప్పటికి ఏక్ నంబర్ నేలబారు వాదనలకు దిగుతారు. వీళ్ళకు ‘సహజీవనం – దాని సిద్దాంతం ‘ ట్రాన్స్ జెండర్ – వారి హక్కులూ ‘ , ‘మానవవాదం – దాని పుట్టుపూర్వోత్తరాలు ‘ , బోల్ష్విక్ విప్లవం – శ్రీకాకుళం ఉద్యమం మీద దాని ప్రభావం ‘ లాంటి అనేక విషయాలమీద క్షుణ్ణంగా అవగాహన ఉంటుంది. కానీ కులవివక్షా, దాని వికృతరూపం మీద మాత్రం పెద్దగా వగాహన ఉండదు. ఎందుకంటే పాపం వారికి చిన్నప్పటినుండీ ఈ విషయాలను తెలియజెప్పే కుటుంబ, ఆర్ధిక, సామాజిక, నైతిక, లైంగిక, తాత్విక , జజ్జనక నేపధ్యం లేదు.
ఎంత సామాజిక, వైజ్ఞానిక ,ఆర్ధిక మార్పులు వచ్చినా ఇక్కడి మనుషుల మనసుల్లోని లేకితనం మాత్రం పోదు. ఎందుకంటే పోకుండా వుంచుకునే అనేక తరుణోపాయాలు వారివద్ద పుష్కలంగా ఉన్నాయి. తంగలాన్ లాంటి ముప్పై సినిమాలు చూపించినా అందులోని విషయాన్ని అర్ధంచేసుకోడాన్ని పక్కనపెట్టి దాని బొక్కల్ని వెతికే ప్రయత్నమే చేస్తారు.

బొక్కాస్ అర్ మోర్ ఇంపార్టెంట్ దేన్ విషయం! – Copied from his Facebook wall
—————————–

తంగలాన్ చూడాలనుకుంటున్నారా…. ఇది చదవండి Indus Martin
———————————————–
1. ఈ దేశంలో అసలు సత్యాన్ని చెప్పడం ప్రస్తుతం నిషేధం. సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నంలో సిలబస్ డిలీట్ చెయ్యడం, చరిత్రను తారుమారు చెయ్యడం, వూర్లూ ప్రదేశాల పేర్లు మార్చెయ్యడం, అబద్దాలను పెద్దగొంతుతో అధికారికంగా ప్రచారం చెయ్యడం, సత్యం మాట్లాడేవాళ్ళమీద దాడులు చెయ్యడం, వాళ్ళమీద అధికార సంస్థలతో దాడులు జరిపించడం జరుగుతున్న నేపధ్యంలో మార్మికంగా సత్యాన్ని చెప్పడమే మిగిలి ఉన్న మార్గం. అలాంటి మార్మిక మార్గాన్నే పా రంజిత్ ఎంచుకున్నాడు.

2. దక్షిణ జంబూద్వీపంలో హైందవానికి ముందు ఉన్నదంతా బౌద్దమే. బౌద్ధం, జైనం రెండూ దక్షిణ భారతంలో శాంతియుత సమాజాన్ని నెలకొల్పాయి. దానికి పూర్వం ప్రజలు అనుసరించింది సర్పపూజ. ఇక్కడి స్థానిక ప్రజల్ని నాగజాతి అనేవారు. వాళ్ళే ఈ భూమిని స్వతంత్రించుకుని బ్రతికారు. తరవాత వచ్చిన బ్రాహ్మణ వేదమతం ( కాలక్రమేణా హిందూమతం) బౌధ, జైన ఆరామాలనూ, ప్రజలనూ, సిద్ధాంతాలనూ నాశనం చేసింది. ఇప్పుడు జైనులం అని చెప్పుకునేవారంతా హైందవానికి పర్యాయం మాత్రమే. అసలు జైన సిద్దాంతం వారిలో ఇప్పుడు లేదు.

3. బౌద్ధాన్ని నాశనం చేయడానికి పూనుకున్నవారిలో ప్రధాన పాత్ర ఆదిశంకరాచార్యుడిది. ఆయన బ్రాహమణ వేద సిద్ధాంతాలను ప్రజలమీద రుద్దడానికి స్థానిక రాజులనూ, సామంతులనూ తన వితండ వాదనలతో తికమకపెట్టి దేవుడూ, పునర్జన్మల పేరుతో భయపెట్టి వశం చేసుకుని వారిని ( మరీ ముఖ్యంగా శివారాధక రాజులను) బౌద్ధ సన్యాసులూ, ఆరామాలూ, చైత్యాల మీదకు ఉసిగొల్పాడు. చాలా పిన్న వయసులోనే ఈ పనికి పూనుకున్నాడు. బుద్ధవిగ్రహాల నాశనాన్ని ఒక ఉద్యమంగా పెట్టుకుని భారత ఉపఖండం మొత్తం పర్యటించాడు. ఆయన పర్యవేక్షణలోనే అనేక బౌద్ధ జైన ఆలయాలు హైందవాలయాలుగా మార్చబడ్డాయి. ఇప్పటి అనేక ప్రసిద్ద హైందవాలయాల పునాదులు బౌద్ధాలయాల మీద న్నిర్మితమైనవే.

4. 1000- 1100 సంవత్సరాల మధ్య బ్రతికిన రామానుజం తన విశిష్ఠద్వైత వైష్ణవ సిద్ధాంతలతో సన్స్కరణలకు పూనుకున్నాడు. దాసకులాలుగా గుర్తించబడిన అనేక వెనుకబడిన కులాల ప్రజలకు వైష్ణవారాధనా అవకాశం కల్పించాడు. బ్రాహ్మణులుగా మారే క్రతువును ప్రవేశపెట్టాడు. పుట్టుకతో కాకుండా స్వయం నిర్ణయంతో సామాజిక సమూహ గుర్తింపును పొందే మార్గాన్ని ప్రవేశపెట్టాడు. ఆయనను అనుసరించిన అనేక నిమ్నజాతి ప్రజలు వైష్ణవ భక్తిమార్గంలో ప్రవేశించారు. ఆవిధంగా వారు తమ నాగ/బౌద్ధ మూలాలకు దూరం కూడా అయ్యారు.

5. సగటు ఇండియన్ సినిమాలో కనబడే ప్రతీకలూ, భావనల స్థానంలో ప్రత్యామ్నాయ ప్రతీకల్ని వాడి అంతా అనుకునే ఈ డామినేటింగ్ భావజాలం పక్కనే మరొక భావజాలం, దానితాలూకు సింబాలిజం, మెటాఫర్ ఉందని జ్ఞాపకం చేస్తాడు పా రంజిత్. భోజనం అనగానే వెజిటేరియన్, లేదా సర్వత్రా ఆమోదం అనుకునే చికెన్ మటన్ లను చూపించే స్థానంలో బీఫ్ కూడా ఇష్టమైన ఆహారంగా భావించే సమాజం ఉందనే సత్యాన్ని ధైర్యంగా చెబుతాడు. పెళ్ళికాని జంటల ప్రేమే లవ్ స్టోరీ అనుకునే సినిమాటిక్ ప్రపంచంలో పెళ్ళై నలుగురు పిల్లలున్న జంట, అందునా మిధునం సినిమాలో ఉండే వృద్ధ బ్రాహ్మణజంట కాకుండా అంటరానివారిగా ముద్రవేయబడిన జంటల మధ్యకూడా అనురాగం వుంటుందని చెబుతాడు. వాళ్ళ జీవన విధానం, కుటుంబ అనురాగం, అనుబంధాల మీద వెలుగును ప్రకాశిస్తాడు.

6. భూమి అన్నిటికన్నా మెయిన్ డిసైడింగ్ ఫ్యాక్టర్, మిగతా సోకాల్డ్ విలువలన్నీ పెద్ద డొల్ల అనీ చెప్పాలని చూస్తాడు.

7. హైందవం క్రైస్తవం రెండూ తమతమ స్వార్ధానికి కిందికులాలను వాడుకున్నవే. దేవుడే అభూతకల్పన. ఆపేరుతో వచ్చే ఎవడైనా వంచించక మానడు. వంచకుడు వాడి మతసిద్దాంతాలను వ్యతిరేకించే ఎవరినైనా సైతాన్/ భూతం/ మాత్రికుడు/ అవిశ్వాసి అనే పేర్లతో నాశనం చెయ్యడానికి పూనుకుంటాడు.

8. తమ భూమిమీదా, దాని ఉత్పత్తులమీదా గౌరవం, బాధ్యత కలిగిన జాతే దానికి నిజమైన వారసులు. తినీ కూర్చునే మనుషులు ఎప్పుడూ పుకార్లూ, విశ్వాసాలూ, నమ్మకాల ప్రచారంలో పబ్బం గడుపుకుంటారు. వాళ్ళ మనుగడకు అబద్దమే ఆలంబన.

9. బంగారం మానవ చరిత్రమీద చూపిన ప్రభావం లోతైనది. మనిషిలోని దురాశా, లోభత్వం, స్వార్ధం, లేకితనంలాంటి అనేక దుర్లక్షణాలకు బంగారం ప్రతీక. దాన్ని దక్కించుకోడానికి తీసిన ప్రాణాల లెక్కలు వూహకు అందవు. బంగారం భూమిలోని ఖనిజం. ఖనిజాలు భూమిపుత్రుల స్వాస్థ్యం. వాటిని తవ్వి తీసుకెళ్ళాలనుకునే ఎవడైనా దోపిడీదారుడే… వాడు ప్రభుత్వం అయ్యి ఉండవచ్చు, లేదా మైనింగ్ కంపెనీ అవ్వవచ్చు…. అంతా దొంగలే, భూమిపుత్రుల వినాశకులే.

10. తెల్లదొరల దగ్గర చేరిన మొదటి తొత్తులు రాజులూ, పైకులాల వారే. వాళ్ళ దేశభక్తి కేవలం వాళ్ళ దోపిడీ వ్యవస్థను పటిష్టం చేసుకునే ముసుగువాదనే. వాళ్ళే ముందు తెల్లభాషా, సన్స్కృతీ నేర్చుకుని కింది వర్ణాలనూ, కులాలనూ తికమకపెట్టారు. తెల్లజాతి ఆగడాలకు వాళ్ళే మార్గం సరాళం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *