భారత మార్కెట్లో కార్ల ప్రపంచం రోజురోజుకీ మారిపోతోంది. ప్రతి నెల కొత్త మోడళ్లను విడుదల చేస్తూ ఆటో కంపెనీలు కస్టమర్లను ఆకర్షించేందుకు పోటీ పడుతున్నాయి. ఇప్పుడు ఆ పోటీలో మారుతి సుజుకి కూడా బాగానే దూసుకెళ్తోంది. ఇప్పటికే బ్రెజ్జా, గ్రాండ్ విటారా లాంటి పాపులర్ ఎస్‌యూవీలను మార్కెట్లోకి తీసుకువచ్చిన మారుతి.. ఇప్పుడు మరో కొత్త SUVని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. దీపావళికి ఓ గ్రాండ్ గిఫ్ట్‌లా మార్కెట్లోకి రాబోతున్న ఈ కార్ పేరు ‘ఎస్కూడో’గా ఉండనుందని సమాచారం. అయితే ఇది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు.
గ్రాండ్ విటారా ఆధారంగా రూపొందించిన నూతన ఎస్యూవీ
ఈ కొత్త కారును గ్రాండ్ విటారా ప్లాట్‌ఫామ్‌ను ఆధారంగా చేసుకుని తయారు చేశారు. అందుకే దీని డిజైన్, ఫీచర్లు, ఇంజిన్ పర్ఫార్మెన్స్ కూడా కొంతవరకు గ్రాండ్ విటారాను గుర్తుచేసేలా ఉంటాయి. ప్రస్తుతం ఈ కారును ‘మారుతి Y17’ అనే కోడ్ నేమ్‌తో పిలుస్తున్నారు. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం దీనికి ‘ఎస్కూడో’ అనే పేరు పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
బ్రెజ్జా కన్నా పెద్దది, విటారాకంటే కొత్త స్టైల్‌తో
కొత్త ఎస్కూడో కార్ పరిమాణం విషయానికి వస్తే, ఇది బ్రెజ్జా కంటే కొంచెం పెద్దదిగా ఉండనుంది. దీని పొడవు సుమారు 4,330 mm నుంచి 4,365 mm వరకు ఉండొచ్చని అంచనా. దీనివల్ల ఇంటీరియర్‌లో ప్రయాణికులకు మంచి లెగ్ రూమ్, స్పేస్ లభిస్తుంది. అలాగే బూట్ స్పేస్ కూడా గ్రాండ్ విటారాతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉండనుంది. ఫ్యామిలీగా ప్రయాణించే వారికి ఇది ఒక మంచి ఎంపికగా మారుతుంది.
ఫీచర్లు చూసినవారికి షాక్
ఎస్కూడో కార్కి సంబంధించి మరో ముఖ్యమైన విషయం.. ఇందులో వచ్చే పవర్‌ట్రెయిన్. ఇది ఒక హైబ్రిడ్ వాహనం. అంటే పెట్రోల్‌తో పాటు హైబ్రిడ్ వేరియంట్ కూడా అందుబాటులోకి రానుంది. 1.5 లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు 1.5 లీటర్ హైబ్రిడ్ వేరియంట్ కూడా లభించనుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్, లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానుంది. పెట్రోల్ ఇంజిన్ గరిష్టంగా 103 bhp శక్తిని ఇచ్చేలా డిజైన్ చేశారు. హైబ్రిడ్ సిస్టమ్ అయితే 79 bhp శక్తితో పాటు 141 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనివల్ల మైలేజ్ బాగా వస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ప్రేమియం కారు లుక్.. కానీ అఫోర్డబుల్ ధరలో
ఎస్కూడో లుక్ చూస్తే అది ఖరీదైన SUVలాంటిదే అనిపిస్తుంది. కానీ మారుతి లక్ష్యం మాత్రం దీనిని అందరికీ అందుబాటులో ఉండే ధరలతో అందించడమే. అందుకే ఇందులో కొన్ని ప్రీమియం ఫీచర్లు తీసివేసే అవకాశం ఉంది. కానీ అవసరమైన అన్ని ఫీచర్లు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందువల్ల డిజైన్ ప్రీమియంగా కనిపించినా, ధర మాత్రం సాధారణ SUVల స్థాయిలోనే ఉంటుందనడంలో సందేహం లేదు.
ఎప్పుడు వస్తుంది.. ఎక్కడ లభిస్తుంది?
మారుతి సుజుకి కొత్త ఎస్కూడో 2025 దీపావళికి విడుదల కానుంది. అంటే సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో దీని లాంచ్ జరిగే అవకాశం ఉంది. దీన్ని మారుతి అరీనా డీలర్‌షిప్‌ల ద్వారా విక్రయించనున్నారు. నెక్సా డీలర్‌షిప్‌లు కాకుండా, సాధారణ మారుతి డీలర్ షిప్లలోనే లభిస్తుంది. ఈ నిర్ణయం వల్ల చాలా మందికి ఈ కారు సులభంగా అందుబాటులోకి రానుంది. మధ్య తరగతి ఫ్యామిలీలను లక్ష్యంగా ఉంచుకుని ఈ SUVని ప్రామాణిక ఫీచర్లతో తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో కంపెనీ ముందుకు వెళ్తోంది.
ధర ఎంత ఉంటుంది?
ఇప్పుడు అందరికీ ఆసక్తికరమైన అంశం ఇదే. కొత్త ఎస్కూడో SUV ధర ఎంత? మార్కెట్ అంచనాల ప్రకారం ఈ కారు ధర మారుతి బ్రెజ్జా కంటే ఎక్కువగా, కానీ గ్రాండ్ విటారాకంటే తక్కువగా ఉండనుంది. అంటే బేస్ పెట్రోల్ వేరియంట్ ధర సుమారు రూ.10 లక్షల నుండి రూ.11 లక్షల వరకు ఉండొచ్చని సమాచారం. అదే సమయంలో టాప్ ఎండ్ హైబ్రిడ్ వేరియంట్ ధర దాదాపు రూ.20 లక్షలు వరకు వెళ్లొచ్చని అంచనా వేస్తున్నారు. ఇది గ్రాండ్ విటారా ధరలతో సమానంగా ఉంటుంది. కానీ ఇందులో కొన్ని తేడాలు ఉండే అవకాశం ఉంది.
మారుతి ఫ్యాన్స్ కోసం దీపావళి బంపర్ ఆఫర్
మొత్తం మీద చూస్తే, కొత్త ఎస్కూడో మారుతి అభిమానులకూ SUV ప్రేమికులకూ మంచి గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీపావళికి మంచి గిఫ్ట్‌లా మార్కెట్లోకి రానున్న ఈ కార్.. గ్రాండ్ విటారా టెక్నాలజీతో, మరింత అఫోర్డబుల్ ధరతో వస్తుండటమే హైలైట్. ధర, డిజైన్, మైలేజ్, స్పేస్ అన్నింటిలోనూ ఇది కస్టమర్లను ఆకట్టుకునేలా ఉండనుంది. పైగా మారుతి నెట్వర్క్ బలంగా ఉండటంతో ఈ కార్ ఎక్కువ మంది వరకు చేరుకునే అవకాశం ఉంది. SUV కొనాలని అనుకుంటున్నవారికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎంపికగా మారే అవకాశం ఉంది.
ఇంకా ఆలోచిస్తున్నారా? దీపావళి వరకు ఎదురు చూడండి.. మారుతి కొత్త ఎస్కూడో మీ హార్ట్కే కాకుండా మీ బడ్జెట్‌కూ నచ్చుతుంది!