న్యూఢిల్లీ: ఢిల్లీని ముంచెత్తినవడగాలులు ఓ నడివయస్కుడు మృతి చెందాడు. వడదెబ్బకు గురై ఆస్పత్రిలో చేరిన అతడి శరీర ఉష్ణోగ్రత చూసి డాక్టర్లు అవాక్కయ్యారు.
అతని శరీర ఉష్ణోగ్రత సాధారణం కంటే 10 డిగ్రీలు ఎక్కువగా ఉండటం గమనార్హం. సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి చెందిన డాక్టర్ రాజేష్ శుక్లా వెల్లడించారు.
బీహార్‌లోని దర్భంగా పట్టణానికి చెందిన 40 ఏళ్ల వ్యక్తి సోమవారం ఢిల్లీలో వడదెబ్బకు గురయ్యాడు. వెంటనే ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చేర్పించారు. అతని శరీర ఉష్ణోగ్రత 108 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు చేరుకోవడం చూసి మేము ఆందోళన చెందాము.
అతడిని కాపాడేందుకు మా వంతు ప్రయత్నం చేశాం. కానీ అతని శరీరంలోని అధిక వేడి కారణంగా, అతని మూత్రపిండాలు మరియు కాలేయం విఫలమయ్యాయి. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగానే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వివరించారు.
ఒక్క ఆస్పత్రిలో 2 గంటల్లో 16 మంది చనిపోయారు
పాట్నా: బీహార్‌లోని ఒకే ఆసుపత్రిలో విపరీతమైన ఉష్ణోగ్రతలు 16 మందిని బలిగొన్నాయి. ఈ విషాద ఘటన ఔరంగాబాద్‌లోని జిల్లా ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. గురువారం 44 డిగ్రీల సెల్సియస్, బుధవారం 48.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండ వేడిమికి తట్టుకోలేక జనం పిట్టల్లా కుప్పకూలిపోయారు. పలువురిని అక్కడి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా గురువారం రెండు గంటల్లోనే 16 మంది మృతి చెందారు.