నాగర్ కర్నూల్ జిల్లాలోని దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (SLBC) సొరంగం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 22న ఉదయం 8:30 గంటల ప్రాంతంలో టన్నెల్ బోరింగ్ మెషిన్ (TBM)తో పనులు జరుగుతుండగా సొరంగం పైకప్పు కూలిపోయింది. సొరంగం నుండి 14 కి.మీ దూరంలో ఉన్న షీర్ జోన్ అనే భాగంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో, 50 మంది కార్మికులు లోపల ఉన్నారు. 42 మంది బయటకు రాగలిగారు, కానీ 8 మంది కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. వీరిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు సాంకేతిక సిబ్బంది, నలుగురు కార్మికులు ఉన్నారు.
దీనితో, భారత సైన్యం, నేవీ, NDRF, SDRF, సింగరేణి కాలరీస్, హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన బృందాలు, అలాగే ఉత్తరాఖండ్ రాట్ హోల్ మైనర్స్ నిపుణులు సహాయక చర్యలో పాల్గొన్నారు. మార్చి 9న, పంజాబ్‌కు చెందిన TBM ఆపరేటర్ గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని శిథిలాల నుండి వెలికితీశారు. మార్చి 25న ప్రాజెక్ట్ ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని కూడా కనుగొన్నారు. మిగిలిన ఆరుగురి ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
అక్కడి పరిస్థితి ఏమిటి..?
సొరంగం ప్రమాదంలో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 43 రోజులుగా, NDRF, SDRF సిబ్బందితో పాటు రైల్వే, సింగరేణి మరియు ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. వారు సొరంగంలో పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారు. రోబోల ద్వారా సహాయం అందించే ప్రయత్నం విఫలమైనందున, పోక్లెయిన్‌లతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 13.730 కి.మీ, 13.884 కి.మీ మధ్య, సొరంగంలో 10 అడుగుల ఎత్తు వరకు రాళ్ళు, మట్టి పేరుకుపోయాయి. దానిని తొలగించడానికి ఆధునిక పద్ధతులను ఉపయోగిస్తున్నారు. అయితే, ఆశించిన ఫలితాలు రావడం లేదు. 13.936 కి.మీ వద్ద D1 ప్రాంతంలో 20 మీటర్ల వరకు సిబ్బందికి అనుమతి లేదు. దీనిని ప్రమాదకరమైన ప్రాంతంగా గుర్తించారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు కన్వేయర్ బెల్ట్‌పై ఉన్న మట్టి మరియు వ్యర్థాలను బయటకు పంపుతున్నారు. సొరంగంలోని ఐదు పోక్లెయిన్‌ల ద్వారా సహాయక చర్యలు వేగంగా జరుగుతున్నాయి.
Related News
ఆరుగురి అవశేషాలు దొరుకుతాయా?
శనివారం సొరంగం ప్రవేశద్వారం వద్ద రెస్క్యూ బృందాల సీనియర్ అధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా SLBC ప్రత్యేక అధికారి శివశంకర్ మాట్లాడుతూ.. మట్టిలో చిక్కుకున్న ఆరుగురి అవశేషాలను గుర్తించే లక్ష్యంతో సహాయక చర్యలు చేపట్టాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మొదట్లో సొరంగంలో సహాయక చర్యలకు రోబోలను ఉపయోగించాలని అనుకున్నారు. అయితే, సాంకేతిక సమస్యల కారణంగా, రోబోల పనితీరు అంచనాలకు తగ్గట్టుగా లేదు. మూడు రోజులుగా ప్రయత్నించి విజయం సాధించకపోవడంతో, వాటిని వెనక్కి పంపించారు. ప్రస్తుతం, పోక్లెయిన్లు, సిబ్బంది మాత్రమే సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. వారి అవశేషాలను త్వరలో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు.