ఏపీలో సంక్రాంతి సెలవులపై సంకీర్ణ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. జనవరి 10 నుంచి 19 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్‌సిఇఆర్‌టి డైరెక్టర్ కృష్ణా రెడ్డి స్పష్టం చేశారు.
2024-25 అకడమిక్ క్యాలెండర్ ప్రకారం సెలవులు ఉంటాయని కృష్ణా రెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా ఇప్పటికే పలు జిల్లాల్లో పాఠశాలలకు స్థానికంగా సెలవులు ఇవ్వడంతో ఈసారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలను నమ్మవద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
మరోవైపు.. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న మాత్రమే ప్రభుత్వ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వం డిసెంబర్ 24, 26 తేదీలను ఐచ్ఛిక సెలవులుగా ప్రకటించింది. 2025కి సంబంధించిన సెలవుల జాబితాను కూడా ప్రభుత్వం వెల్లడించింది.
ఈ షెడ్యూల్ ప్రకారం, 2025లో మొత్తం 23 సాధారణ సెలవులు మరియు 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. సాధారణ సెలవులు మరియు ఐచ్ఛిక సెలవులు రెండూ కలిపి మొత్తం 44 రోజులు సెలవులు ఉంటాయని AP ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ప్రకటించిన సెలవుల్లో 4 ఆదివారాల్లోనే వచ్చాయి. గణతంత్ర దినోత్సవం, ఉగాది, శ్రీరామ నవమి, ముహర్రం ఆదివారాలు కావడం గమనార్హం.
కాగా, ఇటీవల ఏపీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విద్యా సంవత్సరంలో పని దినాలు తగ్గుతాయి. పని దినాలు తగ్గించకుండా ఉండేందుకు సంక్రాంతి సెలవులను కుదించనున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సంక్రాంతి సెలవులను జనవరి 11 నుంచి 15 వరకు లేదా 12 నుంచి 16 వరకు కుదించే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి.దీంతో ఈ వైరల్ వార్తపై అధికారులు క్లారిటీ ఇచ్చారు.