నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి కేసులో ఒక అనుమానితుడిని అరెస్టు చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. సీసీటీవీ కెమెరాలు మరియు సైఫ్ ఇంట్లోని సిబ్బంది అందించిన ఆధారాల ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు వారు తెలిపారు.
ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ సమీపంలో నిందితుడిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. అతడిని విచారించే వరకు పూర్తి వివరాలు ఇవ్వలేమని వారు తెలిపారు. సీసీటీవీ కెమెరాల్లో సైఫ్ ఇంట్లోకి ప్రవేశించిన దొంగ తాలూకా ఇమేజ్ కనిపించింది. దానితో పాటు, దొంగ ఎలా ఉన్నాడో, అతను ఎలాంటి దుస్తులు ధరించాడో వంటి వివరాలను ఇంటి సిబ్బంది స్పష్టంగా చెప్పారు.
20 పోలీసు బృందాలు..
సైఫ్ పై దాడి చేసిన దొంగను పట్టుకోవడానికి ముంబై పోలీసులు 20 బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం, రాత్రి 11 గంటల తర్వాత ఎవరూ ఇంట్లోకి ప్రవేశించలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే, దొంగ అంతకు ముందు ఇంట్లోకి ప్రవేశించి దాక్కుని ఉండవచ్చని.. లేదా ఇంట్లో ఎవరైనా చేసి ఉండవచ్చని వారు అనుమానిస్తున్నారు. సైఫ్ ఇంటి టెర్రస్ పై ఫ్లోరింగ్ పని చేస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు ప్రశ్నించారు. అనుమానితుడు చివరిసారిగా భవనం యొక్క ఆరవ అంతస్తులో పారిపోతూ కనిపించాడు మరియు లాబీలోని CCTV కెమెరాలలో భవనంలోకి ప్రవేశించడం లేదా బయటకు వెళ్లడం కనిపించలేదు, దీనితో అతను ప్రధాన ద్వారం గుండా ప్రవేశించాడా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.