
HEAVY RAIN ALERT TO AP: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని చెబుతున్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. రాయలసీమలోని కొన్ని చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఉష్ణోగ్రతలు 38°C మరియు 40°C మధ్య నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ఆయన చెప్పారు. హోర్డింగ్ల దగ్గర, చెట్లు, గోడలు, శిథిలావస్థలో ఉన్న భవనాల కింద నిలబడవద్దని ఆయన సూచించారు. ఉరుములతో కూడిన భారీ వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రోనంకి కూర్మనాథ్ అన్నారు.
20వ తేదీన తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైఎస్ఆర్, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 21 (బుధవారం) అనంతపురం, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
[news_related_post]శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రోణంకి కూర్మనాథ్ తెలిపారు. మే 22 (గురువారం) పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అయితే సోమవారం రాత్రి 7 గంటల సమయానికి అల్లూరి జిల్లా ఎటపాకలో 41.2, మన్యం జిల్లా కురుపాంలో 36.7, ప్రకాశం జిల్లా వినోదరాయునిపాలెంలో 33.5 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపారు. మరోవైపు సోమవారం విజయనగరం జిల్లా గజపతినగరం, అల్లూరి సీతారామరాజు జిల్లా బుట్టాయిగూడెంలో అత్యధికంగా 38.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.