ఐదేళ్ల తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక రెపో రేటును తగ్గించిన నేపథ్యంలో బ్యాంకులు క్రమంగా వడ్డీ రేట్లను సవరిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వ రంగ దిగ్గజం SBI వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించింది. ఇటీవల మరో ప్రభుత్వ రంగ పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కూడా గురువారం ఒక ప్రకటనలో రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. సవరించిన రేట్లు గృహ, వాహనం, విద్య, వ్యక్తిగత రుణాలతో సహా వివిధ రకాల రుణాలకు వర్తిస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 10 నుండి అమల్లోకి వచ్చాయి. బ్యాంక్ నిర్ణయంతో గృహ రుణాలపై వడ్డీ రేటు 8.15 శాతం నుండి ప్రారంభమవుతుంది. ఫలితంగా బ్యాంక్ అందించే లక్ష రూపాయల రుణంపై EMI రూ.744 నుండి ప్రారంభమవుతుంది. అలాగే, మార్చి 31, 2025 వరకు ముందస్తు ప్రాసెసింగ్ ఫీజులు, డాక్యుమెంటేషన్ ఛార్జీలపై పూర్తి మినహాయింపు నుండి కస్టమర్లు ప్రయోజనం పొందవచ్చని PNB తెలిపింది. వాహన రుణాలపై వడ్డీ రేటు 8.50 శాతం, విద్యా రుణాలపై 7.85 శాతం నుండి, వ్యక్తిగత రుణాలపై 11.25 శాతం నుండి ఉంటుంది. ఈ నెల ప్రారంభంలో, RBI రెపో రేటును 6.50 శాతం నుండి 6.25 శాతానికి తగ్గించిన విషయం తెలిసిందే. ఇది బ్యాంకులు అందించే రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లను కూడా ప్రభావితం చేస్తుంది.
PNB: రిటైల్ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్

20
Feb