ప్రేమ సాగరం: ప్రేమలో నుంచి పుట్టిన ప్రేమ ఏమవుతుందో తెలియదు. కానీ కోపం నుంచి పుట్టిన ప్రేమ ఎప్పటికి నిలిచి ఉటుంది
ఇంటర్ అయిపోయింది. ఇక కాలేజ్‌లో చేరాలి. కాలేజీ అంటే? మూడు విషయాలు. ఒకటి: ఆడపిల్లలు, రెండు: ఆడపిల్లలు, మూడు: ఆడపిల్లలు. ఆ రోజులు ఏ రోజులు? అబ్బాయి తరఫువాళ్లు అమ్మాయిని చూసొచ్చి ‘అమ్మాయి నచ్చిందిరా. చేసుకో’ అని అబ్బాయికి చెప్తే అబ్బాయి నోరు మూసుకొని తాను చూడకపోయినా తాళి కట్టేసే రోజులు. ‘అబ్బాయిని నువ్వు చూడక్కర్లేదు … మేము చూసాం బంగారం లాంటి కుర్రోడు … చేసుకో’ అనగానే అమ్మాయి తాళి కట్టించుకునే రోజులు అవి. అలాంటిది పెళ్లికి ముందే ఒకరినొకరు ఇష్టపడి, గాఢం గా ప్రేమించుకుని, ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ, బోలెడు ప్రేమలేఖలు రాసుకుంటూ, రాత్రిళ్లు నిద్రపట్టక , పగలు ఎప్పుడవుతుందా అని ఆరాటపడుతూ … ఇలాంటి ఒక జీవితాన్ని అనుభవించి, అలాంటి అనుభవానికి కారణమైన అబ్బాయినో/అమ్మాయినో జీవితాంతం సొంతం చేసుకోవడంలో ఉండే ఆనందం కోసం ఒక తరం సిద్ధమవుతున్న కాలం అది. యువతరం అంతా ఒక లాంటి సంప్రదాయం సంకెళ్లు వదిలేసి ప్రేమ కోసం పరిగెత్తే కాలం.
ప్రేక్షకులు ప్రేమకథలకు సిద్ధమయ్యారు. కానీ వీళ్లందరూ మిస్సయ్యింది టి.రాజేందర్ పట్టుకున్నాడు. కాలేజీ. కాలేజీ లైఫ్ చూపించాలి. కాలేజీ అల్లరి. కాలేజీ ప్రేమ. కాలేజీ గంతులు.. పాటలు. నిజంగా కాలేజీ వయసు కుర్రాళ్లతో కాలేజీ ప్రేమ తీయాలని నిశ్చయించుకున్నాడు. హీరోగా గంగ. హీరోయిన్‌గా నళిని. యవ్వనం.. ఉత్సాహం.. సంగీతం.. కవిత్వం. అందుకే సినిమా అంతా ఒక పాటలా ఉండాలని అనుకున్నాడు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒక పాట. పాట పండింది. ‘ప్రేమ సాగరం’ కలెక్షన్లతో పొంగింది.
‘నామం పెట్టు నామం పెట్టు కాలేజీకి .. చిన్నదాని చెయ్యేపట్టు మేరేజీకి’….
సినిమా మొదలైన మొదటి రెండు నిమిషాల్లోనే పాట. ఉత్సాహకరమైన క్లాస్‌రూములు. కలర్‌ఫుల్ క్యాంపస్ పరిసరాలు. ఇటు అమ్మాయి అటు అమ్మాయి ఎటు చూసినా అమ్మాయిలే. ఆ ఊరి కాలేజీలో చదువుదామని నళిని వస్తుంది. ఆ ఊరి అబ్బాయే గంగ. ఆ అమ్మాయిని చూస్తాడు. ఇద్దరివీ ఎదురూబొదురూ ఇళ్లు. నళినికి ప్రేమ పట్ల సదభిప్రాయం లేదు. అలాంటి ఆలోచన లేదు. పైగా ఈ చిల్లర మల్లర ఊరి కుర్రాళ్లంటే లెక్క లేదు. కానీ గంగకు నళినిని చూడటంతోటే ప్రేమైంది. వెంట పడ్డాడు. అతడి వ్యవహారం చూసి నళిని చిరాకు పడింది. అసహ్యించుకుంది. ద్వేషించింది. బుద్ధి చెప్పాలనుకుంది. అతడు రాసినట్టుగా లవ్ లెటర్ సృష్టించి ప్రిన్సిపాల్‌కు కంప్లయింట్ చేసింది. దానికి ప్రతీకారంగా కాలేజీ లో వేసే నాటకంలో హీరో అందరూ చూస్తుండగా స్టేజీ మీద ఆమెకు ముద్దు పెడతాడు . నళిని అన్న రాధా రవి అసలే పెద్ద రౌడీ. ఈ సంగతి తెలిసి ఊరుకుంటాడా? గంగను పట్టుకుని చావ బాదాడు. ఒళ్లు చీరేశాడు. కానీ గంగ మారలేదు. ‘హృదయమనే కోవెలలో నిను కొలిచానే దేవతగా’ అని పాడాడు.
ప్రేమకు తొలిమెట్టు ద్వేషం అయితే మలిమెట్టు సానుభూతి. నళినికి మెల్లగా సానుభూతి మొదలైంది. తన పేరును పచ్చబొట్టు వేసుకొని గంగ జ్వరం తెచ్చుకుంటే సానుభూతి కాస్తా ఇష్టంగా మారింది. ‘నువ్వుకాదంటే చచ్చిపోతాను’ అనంటే ఆ ఇష్టం కాస్త జీవితానికి సరిపడా ప్రేమగా మారింది. ఈ కాలంలోనే ప్రేమకు ఎన్నో ఆటంకాలు ఉన్నాయే… ఆ కాలంలో లేకుండా పోతాయా? నళిని అన్న ఈ ప్రేమకు అడ్డు నిలుస్తాడు. అంతస్తు హోదా అని మాట్లాడతాడు. కానీ ఆ ఇంట్లోనే పెద్దక్క సరిత ఉంటుంది. భర్త వదిలేసిన సరిత. ‘డబ్బు , కులం అని అన్నీ చూసి పెళ్లి చేశావు కదా కానీ ఏమైంది? నా భర్త నన్ను వదిలేశాడు. ప్రేమించినవాడికి ఇచ్చి చేస్తే అదైనా సంతోషంగా ఉంటుంది’ అని తమ్ముడికి చెప్తుంది. కానీ వినడు. స్వచ్ఛమైన ప్రేమను కాపాడటానికి ప్రకృతికూడా ఏదో రకం గా సహకరిస్తుంది . ఈ సినిమాలో కూడా టి.రాజేందర్ ‘చైన్ జైపాల్‌గా ఒక రక్షకుడిలా వస్తాడు. నళిని అన్నను తన ప్రాణత్యాగంతో తుదముట్టిస్తాడు. ప్రేమ జంట ఒకటవుతుంది.
ఏ అడ్డంకులు లేని ప్రేమ ఏమవుతుందో తెలియదు. కానీ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న ప్రేమ బలపడి, గట్టిపడి కడవరకూ నిలుస్తుంది. అమ్మాయికి అబ్బాయి కావాలి. అబ్బాయికి అమ్మాయి కావాలి. తొలి ప్రేమలో గాఢమైన తొలి కౌగిలింతకు మించిన పెన్నిధి వారికి లేదు. ప్రేక్షకులకు కూడా అలాంటి కౌగిలింత ఇచ్చిన సినిమా– ఈ సినిమా– ప్రేమ సాగరం.
ఉయిరుళ్లవరై ఉష (ఉషతో కడదాక)
టి. రాజేందర్ దర్శకత్వంలో 1983లో వచ్చిన ‘ఉయిరుళ్లవరై ఉష’ తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయినట్టుగానే తెలుగులో **‘ప్రేమసాగరం’**గా అంతే పెద్ద హిట్టయ్యింది. ఈ సినిమా పోస్టర్లు, పాటలు దుమ్ము దులిపేశాయి. ఇంత పెద్ద ప్రేమదుమారం ఇంతకు ముందు తెలుగు ప్రాంతం చూడలేదు. ‘చక్కనైన ఓ చిరుగాలి ఒక్క మాట వినిపోవాలి’, ‘అందాలొలికే సుందరి రాతిరి కలలోకొచ్చేను’, ‘బంతాడే బంగారు బొమ్మల్లారా’… ప్రతి పాటా హిట్. అంతవరకూ తెలుగు ప్రేక్షకులు ‘కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం– దాసరి’ అనే టైటిల్ చూశారు. కానీ టి.రాజేందర్ విషయంలో ‘సంగీతం’ అదనంగా చేరడం వింతగా చూశారు. మ్యూజిక్ చేసే హీరో అప్పట్లో వింత. రాజేందర్ ఈ సినిమాలో తల నిండా జుట్టు వేసుకుని ‘ప్రేమ రక్షకుడి’గా నిలవడాన్ని ఆ తర్వాత చాలా సినిమాల్లో అలాంటి రక్షకుని పాత్రలు సృష్టించి కాపీ చేశారు. ‘నళిని’ ఈ తొలి సినిమాతో స్టార్ అయ్యింది. ప్రేమ కథలో యాక్షన్‌ను మిళితం చేయడం, వాన పాట, షవర్ పాట… ఇవన్నీ సగటు ప్రేక్షకుడికి కావలసిన సరంజామాను ఇస్తాయి.
తన్నులు తిన్న హీరోని ‘నా దగ్గర ఉన్న మందు ఇదే’ అని హీరోయిన్ ఒళ్లంతా ముద్దులు పెట్టడాన్ని ఆ రోజుల్లో ఏ కుర్రవాడు ఆశించడూ? ఇవన్నీ సినిమాని పెద్ద హిట్ చేశాయి. టి.రాజేందర్ కొడుకు సింబూ పెద్ద స్టార్ అన్న సంగతి అందరికీ తెలుసు. రాజేందర్ భార్య ‘ఉష’ తెలుగుమ్మాయి. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా తనే. కనుక ఇది తెలుగువారి ప్రమేయం ఉన్న సినిమాగా కూడా గుర్తు పెట్టుకోవాలి.