ఈ రోజుల్లో చిన్న వ్యాపారాలు మొదలెట్టాలనేవాళ్లు, లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలనేవాళ్లు ఎక్కువ మంది పర్సనల్ లోన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. వైద్య ఖర్చులు, చదువు ఖర్చులు, తక్షణ అవసరాల కోసం కూడా చాలా మంది వ్యక్తిగత రుణాలు తీసుకుంటున్నారు.
కానీ వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసుకోవడం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే ఇది మంచి లాభం తెచ్చిపెట్టవచ్చు, లేదంటే దారుణంగా నష్టపోయే పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి, ఇలాంటి రుణం తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి.
తక్కువ డాక్యుమెంట్లతో తక్షణ లోన్ – ఇదే ముఖ్యమైన లాభం
వ్యాపారానికి అవసరమైన డబ్బు వెంటనే కావాలంటే, పర్సనల్ లోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే పర్సనల్ లోన్ తీసుకోవడం చాలా సులభం. పెద్దగా డాక్యుమెంట్లు అవసరం ఉండదు. బ్యాంకుల వారు సాధారణంగా కొన్ని గంటల్లోనే లోన్‌ను అప్రూవ్ చేస్తారు. కానీ అదే వ్యాపార లోన్ అయితే, చాలా డాక్యుమెంట్లు ఇవ్వాలి, మరియు ప్రాసెస్ కావడానికి ఎక్కువ రోజులు పడుతుంది. చిన్న వ్యాపారస్తులకు ఇది ఒక గొప్ప అవకాశంగా చెప్పొచ్చు.
గ్యారెంటీ అవసరం లేదు – కానీ జాగ్రత్త అవసరం
పర్సనల్ లోన్ తీసుకోవడానికి మీరు మీ ఆస్తిని గ్యారెంటీ గా పెట్టాల్సిన పనిలేదు. ఇది కొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టే వారికి చాలా మంచి విషయం. కానీ ఇది కొంత రిస్కుతో కూడినదే. ఎందుకంటే గ్యారెంటీ లేకపోవడం వల్ల బ్యాంకులు ఎక్కువ వడ్డీ వసూలు చేస్తాయి.
కొన్నిసార్లు తిరిగి చెల్లించాల్సిన రుణ పరిమితులు చాలా కఠినంగా ఉండొచ్చు. మీ క్రెడిట్ స్కోర్ మరియు లోన్ కాలం ఆధారంగా వడ్డీ శాతం మారుతూ ఉంటుంది. కనుక, ముందుగా మీ సామర్థ్యాన్ని బాగా అంచనా వేసుకుని తీసుకోవడం మంచిది.
ఎక్కువ మొత్తంలో డబ్బు కావాలంటే
పర్సనల్ లోన్ పొందడం సులభమే కానీ, దానిలో కొన్ని పరిమితులూ ఉంటాయి. బ్యాంకులు సాధారణంగా రూ.10 లక్షల వరకు మాత్రమే పర్సనల్ లోన్ ఇస్తాయి. పెద్ద స్థాయి వ్యాపారాల కోసం ఇది చాలకపోవచ్చు. మీ వ్యాపారం కోసం ఎంత డబ్బు అవసరమో ముందే అంచనా వేసి, అది ఈ లోన్‌తో కవర్ అవుతుందా అని తెలుసుకోవాలి. అవసరమైతే బిజినెస్ లోన్ తీసుకోవడానికీ ఆలోచించాలి.
మీ క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది
పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత, మీరు టైం కి EMI చెల్లిస్తే, మీ క్రెడిట్ స్కోర్ మెరుగవుతుంది. ఇది భవిష్యత్తులో మరింత సులభంగా లోన్లు పొందేందుకు దోహదపడుతుంది. కానీ ఒకవేళ మీరు లేట్ గా చెల్లిస్తే, మీ స్కోర్ పడిపోతుంది. తద్వారా తర్వాత లోన్ లేదా క్రెడిట్ కార్డు తీసుకోవడం కష్టమవుతుంది.
టాక్స్ పరంగా కూడా ప్రభావం ఉంటుంది
మీరు వ్యాపారం కోసం పర్సనల్ లోన్ తీసుకుంటే, మీరు టాక్స్ డిడక్షన్‌కు అర్హత పొందవచ్చు. కానీ మీరు ఆ డబ్బును వ్యాపారంలో పెట్టామని సరైన డాక్యుమెంట్లు చూపించాలి. లేదంటే ఇబ్బందులు వస్తాయి. కనుక ఒక చార్టర్డ్ అకౌంటెంట్ సహాయం తీసుకుంటే మంచిది. వారు మీ టాక్స్ ఫైలింగ్‌ను సరిగా ప్లాన్ చేయగలరు.
లోన్ తీసుకునే ముందు ఈ విషయాలు గుర్తుంచుకోండి
మీరు పర్సనల్ లోన్ కోసం అప్లై చేయబోతున్నా, ముందుగా వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, ముందస్తు చెల్లింపు ఛార్జీలు వంటివి పూర్తిగా తెలుసుకోవాలి. అన్ని బ్యాంకుల రేట్ల వ్యత్యాసం చూసుకోండి. దీర్ఘకాలం కోసం లోన్ తీసుకుంటే నెలవారీ EMI తక్కువగా ఉంటుంది కానీ మొత్తం వడ్డీ ఎక్కువగా వస్తుంది. కనుక మీ అవసరానికి తగ్గట్టుగా కాలపరిమితిని ఎంచుకోండి.
మీ క్రెడిట్ స్కోర్ 750కు పైగా ఉంటే, మీకు తక్కువ వడ్డీతో లోన్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే, అవసరం లేని లోన్లు తీసుకోవడం ఆపండి. అవసరమైతేనే రుణం తీసుకోండి. ప్రతి నెల EMI టైం కి చెల్లించండి, ఆలస్యం అయితే పెనాల్టీలు పడతాయి. మీ క్రెడిట్ హిస్టరీ బాగుండాలంటే ఇలా జాగ్రత్తగా వ్యవహరించాలి.
మొత్తంగా చూస్తే
పర్సనల్ లోన్ ద్వారా వ్యాపారం నడిపించడం సరైన ఎంపికే కానీ కచ్చితంగా ముందు అన్ని విషయాలు గమనించాలి. తక్షణ డబ్బు కావాలి కాబట్టి తొందరపడకండి. ఒకసారి లోన్ తీసుకున్న తర్వాత మీరు సమయానికి చెల్లించలేకపోతే, అది మీకు భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది.
కనుక అన్ని కోణాల్లో కూడా ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోండి. అప్పుడే మీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, మీరు ఆర్ధికంగా బలపడతారు.