New Year celebrations: న్యూఇయర్‌ వేడుకలు.. ఫ్లైఓవర్ల మూసివేత.. 31న రాత్రి ఉచిత ప్రయాణం

న్యూఇయర్‌ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. డిసెంబరు 31 రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఐటీ కారిడార్‌లో ఫ్లైఓవర్లను మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఓఆర్‌ఆర్‌పై భారీ వాహనాలు, ఎయిర్‌పోర్టుకు వెళ్లే వాహనాలను మాత్రమే అనుమతిస్తామన్నారు. సైబరాబాద్ కమిషనరేట్‌ పరిధిలో స్పెషల్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. సిగ్నల్ జంపింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్‌ పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు చేపడతారని చెప్పారు. మద్యం సేవించిన వారికి పబ్‌లు, బార్ల యాజమానులు ప్రైవేటు వాహనాలు, డ్రైవర్లను అందుబాటులో ఉంచాలని పోలీసులు సూచించారు.

31న రాత్రి ఉచిత ప్రయాణం

న్యూఇయర్‌ వేడుకల దృష్ట్యా డిసెంబరు 31న రాత్రి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్లు తెలంగాణ ఫోర్‌ వీలర్స్‌ సంఘం ప్రకటించింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. 500 కార్లు, 250 క్యాబ్‌లు అందుబాటులో ఉంటాయని అసోసియేషన్‌ తెలిపింది. ప్రజలు మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని, రోడ్డు ప్రమాదాలు జరగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

మెట్రో ప్రయాణ వేళల్లో మార్పులు

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రయాణ వేళల్లో ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు మార్పులు చేసింది. డిసెంబరు 31న అర్ధరాత్రి 12.30 గంటల వరకు (జనవరి 1 ప్రారంభ వేళల్లో) మెట్రో రైలు సర్వీసులను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. న్యూఇయర్‌ వేడుకల తర్వాత ప్రతి ఒక్కరూ రవాణా ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా ఇళ్లకు చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎల్‌అండ్‌టీ మెట్రో ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొంది. ప్రతి కారిడార్‌లో చివరి మెట్రో స్టేషన్‌ నుంచి ఆఖరి సర్వీసు 12.30 గంటలకు బయలుదేరుతుందని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *