ఆర్థిక సంవత్సరం 2025-26 ప్రారంభం.. మీ బ్యాంక్, ట్యాక్స్, UPI సేవలపై కీలక మార్పులు – మీకు తెలుసా?

ఇవాల్టి నుండి (ఏప్రిల్ 1, 2025) కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కానుంది. దీని కారణంగా మ్యూచువల్ ఫండ్లు, క్రెడిట్ కార్డులు, UPI లావాదేవీలు, ఆదాయపు పన్ను (Income Tax), GST వంటి అనేక రంగాల్లో ముఖ్యమైన మార్పులు జరుగనున్నాయి. ఈ మార్పులు పెట్టుబడిదారులు, పన్ను చెల్లింపుదారులు, సామాన్య ప్రజలు అందరికీ ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి, ఈ కొత్త నిబంధనల గురించి ముందుగా తెలుసుకొని మీ ఆర్థిక ప్రణాళికను సరిచేసుకోవడం మంచిది.

GST & e-ఇన్వాయిసింగ్ కొత్త నిబంధనలు

ఏప్రిల్ 1, 2025 నుంచి రూ. 10 కోట్ల కంటే ఎక్కువ వార్షిక టర్నోవర్ ఉన్న వ్యాపారాలకు e-ఇన్వాయిస్ నమోదు తప్పనిసరి కానుంది. ఇప్పటి వరకు రూ. 100 కోట్లకు పైబడిన కంపెనీలకు మాత్రమే ఈ నిబంధన వర్తించేది. కానీ ఇప్పుడు చిన్న, మధ్య తరహా వ్యాపారాలు కూడా ఈ నిబంధనలోకి వస్తాయి. దీనివల్ల GST కట్టుబాటు (compliance) మరింత కఠినతరం కానుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిక్స్‌డ్ పెన్షన్

ఏప్రిల్ 1, 2025 నుండి యునిఫైడ్ పెన్షన్ స్కీమ్ (UPS) అమలులోకి రానుంది. ఈ స్కీమ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నిశ్చిత పెన్షన్ అందిస్తుంది. కనీసం 25 సంవత్సరాల సేవ పూర్తి చేసిన ఉద్యోగులకు, రిటైర్మెంట్ తర్వాత చివరి 12 నెలల సగటు ప్రాథమిక జీతం (Basic Salary)లో 50% పెన్షన్‌గా లభిస్తుంది. ఇది పదవీవిరమణ తర్వాత ఆర్థిక భద్రత కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు పెద్ద ఊరట.

UPI ID బ్లాక్ అవ్వవచ్చు – జాగ్రత్త

మీ ఫోన్ నెంబర్ మారిందా? లేదంటే, UPI సేవలు బంద్ కావచ్చు. NPCI (National Payments Corporation of India) బ్యాంకులకు, UPI సర్వీస్ ప్రొవైడర్లకు మార్చి 31, 2025లోపు డేటాబేస్‌ను అప్‌డేట్ చేయాలని ఆదేశించింది. పాత మొబైల్ నంబర్లు లేదా రీసైకిల్ అయిన నంబర్లు తొలగించబడతాయి. మీరు మీ బ్యాంక్ అకౌంట్ లేదా UPI IDను యాక్టివ్ మొబైల్ నంబర్‌కు లింక్ చేసి ఉంచుకోవాలి. లేకపోతే, మీ UPI సేవలు నిలిపివేయబడే అవకాశం ఉంది.

విదేశాల్లో చదువుతున్న పిల్లలకు డబ్బు పంపితే రూ. 10 లక్షల వరకు ట్యాక్స్ లేదు

లిబరలైజ్డ్ రమీటెన్స్ స్కీమ్ (LRS) కింద ఏప్రిల్ 1, 2025 నుండి విదేశాల్లో చదువుతున్న పిల్లలకు రూ. 10 లక్షల వరకు డబ్బు పంపితే, TDS (Tax Deducted at Source) లేకుండా వెళ్ళిపోతుంది. ఇంతకు ముందు రూ. 7 లక్షల పైగా డబ్బు పంపితే 5% TDS చెల్లించాలి. ఇది పిల్లలను విదేశాల్లో చదివిస్తున్న తల్లిదండ్రులకు పెద్ద ఊరట.

క్రెడిట్ కార్డుల రివార్డ్ పాయింట్లలో మార్పులు

ఏప్రిల్ 1 నుంచి క్రెడిట్ కార్డు రివార్డ్ పాయింట్లలో కొన్ని మార్పులు జరగనున్నాయి.

SBI SimplyCLICK క్రెడిట్ కార్డు: Swiggyపై 10X రివార్డ్ పాయింట్లు 5Xకి తగ్గింపు, అయితే Myntra, BookMyShow, Apollo 24|7 లలో 10X పాయింట్లు యథావిధిగా ఉంటాయి. Air India SBI Platinum క్రెడిట్ కార్డు: Air India టికెట్ బుకింగ్‌పై రివార్డ్ పాయింట్లు 15 పాయింట్ల నుండి 5 పాయింట్లకు తగ్గించబడింది.

ఈ కొత్త మార్పులకు ముందుగానే సిద్దం కావాలి

మీ పెట్టుబడులు, బ్యాంక్ అకౌంట్లు, క్రెడిట్ కార్డులు, UPI సేవలు, ట్యాక్స్‌లు – అన్నింటిపై ఈ కొత్త నిబంధనలు ప్రభావం చూపుతాయి. కాబట్టి ఇప్పటి నుంచే అన్ని విషయాలను సరిచూసుకోవడం మంచిది. మరింత నష్టాన్ని తగిలించుకునే ముందు మీ ఆర్థిక ప్రణాళికను మార్పులకు అనుగుణంగా సిద్ధం చేసుకోండి.