
ప్రభుత్వ పాఠశాలలో పిల్లలను చేర్చిన ఉపాధ్యాయుడిపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు!
అమరావతి, జూన్ 30: రాజాం నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన ఇద్దరు చిన్నారులను ప్రభుత్వ పాఠశాలలో చేర్చించడంపై విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఉపాధ్యాయుడి ఈ నిర్ణయం ప్రజలను ఆలోచింపజేసే విధంగా ఉందని, అందుకు ఆ ఉపాధ్యాయుడికి అభినందనలు తెలియజేశారు మంత్రి.
ఇలాంటివి చూస్తుంటే విద్యా వ్యవస్థలో చేపట్టిన సంస్కరణలు, అందులోని సమస్యలను పరిష్కరించేందుకు చేసిన కృషిని మర్చిపోవచ్చంటూ మంత్రి లోకేశ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా పేర్కొన్నారు.
[news_related_post]లోకేష్ ట్వీట్: “ప్రభుత్వ పాఠశాలల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది!”
“ప్రభుత్వ పాఠశాలల ముందు ‘నో అడ్మిషన్’ బోర్డులు చూస్తుంటే ఇది కదా నేను కోరుకున్న మార్పు అనిపిస్తోంది. రాజకీయాలకు దూరంగా, సమగ్ర విద్యకు దగ్గరగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టి, సమస్యలను పరిష్కరించి విద్యాలయాలుగా పాఠశాలలను తీర్చిదిద్దిన కష్టం… రాజాం నియోజకవర్గం డోలపేటకు చెందిన టీచర్ డోల వాసుదేవరావు లాంటి వారిని చూసి మర్చిపోతాం.
తన పిల్లలు ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తున్నారు ఈ మాస్టారు. ‘ఒక మాస్టారే తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చదివిస్తుంటే, మనం ఎందుకు చదివించకూడదు’ అని ప్రజల్లో ఆలోచన రేకెత్తించిన వాసు మాస్టర్‌కు అభినందనలు. మన బడికి మనమే అంబాసిడర్స్‌గా నిలుద్దాం. అంతా కలిసి దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ తీసుకొద్దాం” అంటూ మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు.