పేదల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ అంటే DBT స్కీం ఎంత ఉపయోగపడిందో ఇటీవల విడుదలైన ఓ రిపోర్ట్ ద్వారా బయటపడింది. Blueraft Digital Foundation రూపొందించిన ఈ రిపోర్టును ఆర్థిక మంత్రిత్వ శాఖ షేర్ చేసింది.
2009 నుంచి 2024 వరకు గల గణాంకాల ఆధారంగా ఈ అధ్యయనం జరిగింది. ఇందులో DBT వల్ల ప్రభుత్వ వ్యయంపై, పేదలకు ఇచ్చే సబ్సిడీలపై, సామాజిక ఫలితాలపై ఎలా ప్రభావం పడిందో వివరించారు.
ఈ స్కీమ్ వల్ల దేశానికి ఏకంగా రూ.3.48 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఇది కేవలం ఒక పెద్ద సంఖ్య కాదు. ఇది ప్రజల డబ్బు సమర్థవంతంగా వినియోగంలోకి వచ్చినట్లు సూచిస్తోంది. పేదల హక్కు నిజంగా వారికి అందడం మొదలైంది. మోసాలు, లబ్దిదారుల జరిపే అణచివేతల్ని అడ్డుకుంది.
సబ్సిడీ ఖర్చు తగ్గి, లబ్దిదారుల సంఖ్య పెరిగింది
DBT ప్రారంభానికి ముందు అంటే 2009 నుంచి 2013 వరకు సబ్సిడీ ఖర్చు ప్రభుత్వ మొత్తం ఖర్చులో 16 శాతం ఉండేది. అప్పట్లో సగటున సంవత్సరానికి రూ.2.1 లక్షల కోట్లు ఖర్చు అయ్యేది. కానీ అందులో ఎక్కువ భాగం మోసపూరితంగా లేదా మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లిపోయేది. డబ్బు నిజమైన లబ్దిదారులకు చేరకపోవడం, తప్పుడు లబ్దిదారులు ప్రయోజనం పొందడం వంటి సమస్యలు ఉండేవి.
2014 తర్వాత DBT అమలు మొదలైందప్పటి నుంచి చాలా మార్పులు వచ్చాయి. 2023-24లో ఈ ఖర్చు మొత్తం వ్యయంలో కేవలం 9 శాతానికి పరిమితమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, లబ్దిదారుల సంఖ్య 16 రెట్లు పెరిగినా ఖర్చు తగ్గింది. అంటే ప్రభుత్వం ఇప్పుడు ఎక్కువ మందికి ప్రయోజనం అందిస్తూ తక్కువ ఖర్చుతో ఆ పని సాధిస్తోంది.
అన్నపూర్ణ పథకం వల్ల ఎక్కువ ఆదా
ఈ మొత్తంలో అత్యధిక భాగం అన్నదాతలకు సంబంధించిన Public Distribution System (PDS) వల్ల ఆదా అయింది. ఆధార్ ఆధారిత రేషన్ కార్డు వెరిఫికేషన్ వల్ల రూ.1.85 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఇది మొత్తం ఆదాలో 53 శాతం. పాత రోజుల్లో ఒకరికి ఒకటి కంటే ఎక్కువ రేషన్ కార్డులు ఉండేవి. అలా డబ్బు వృధా అయ్యేది. DBT వల్ల ఇది పూర్తిగా తగ్గిపోయింది.
MNREGAతో సమయానుసారంగా జీతాలు, ఆదా కూడా
ఇంకా MNREGAలో 98 శాతం కార్మికులకు జీతాలు సమయానికి వేసారు. ఇంత సమర్థత వల్ల ఏకంగా రూ.42,534 కోట్లు ఆదా అయ్యాయి. ఇది డబ్బు అర్థవంతంగా వినియోగమైన ఒక మంచి ఉదాహరణ.
PM-Kisanలో అర్హులకే డబ్బు
ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా రైతులకు డబ్బు నేరుగా అకౌంట్‌కి వెళుతుంది. కానీ ఇందులో కూడా చాలా మంది అర్హులు కానివారు ఉండేవారు. DBT వల్ల అటువంటి 2.1 కోట్ల నకిలీ లబ్దిదారులను తొలగించారు. ఇలా రూ.22,106 కోట్లు ఆదా అయింది.
రసాయన ఎరువుల పంపిణీలో కూడా ప్రయోజనం
ఎరువుల పంపిణీలో కూడా లక్షల టన్నుల ఎరువులు మిగిలిపోయాయి. టార్గెట్ చేసిన పద్ధతిలో పంపిణీ వల్ల రూ.18,699.8 కోట్లు ఆదా అయ్యాయి. ఇది కూడా DBT వల్లే సాధ్యమైంది.
డబ్బు నేరుగా బ్యాంక్ ఖాతాలకు
DBT సిస్టమ్‌లో ముఖ్యమైన అంశం ఏమిటంటే, మధ్యవర్తులు ఉండరు. డబ్బు నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాలకు వెళుతుంది. అంతే కాదు, ఆధార్ ఆధారంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ వల్ల మోసాలు పూర్తిగా తగ్గాయి. ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అపవ్వాలు తగ్గిపోయాయి. ఇది ప్రజల నమ్మకాన్ని పెంచే వ్యవస్థగా నిలిచింది.
DBT వల్ల ప్రభుత్వానికి, ప్రజలకు లాభం
ఈ మొత్తం వ్యవస్థ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఖర్చులు తగ్గాయి. మరోవైపు నిజమైన లబ్దిదారులకు డబ్బు చేరుతోంది. న్యాయమైన విధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పని చేస్తున్నాయనే నమ్మకం ప్రజల్లో ఏర్పడింది.
ఇది సామాజిక న్యాయానికి, ఆర్థిక సమర్థతకు నిదర్శనం. ఈ స్కీమ్ కొనసాగితే మరింత మంది పేదలకి న్యాయం జరుగుతుంది. డబ్బు పాడవ్వదు. ఈ కారణంగా DBT వ్యవస్థను అభినందించాల్సిందే. ఇప్పటివరకు ఎవరూ చేయలేని విధంగా డబ్బు ఆదా చేసి, లబ్దిదారులకు నేరుగా లబ్ధి చేకూర్చిన ఈ స్కీమ్ దేశ అభివృద్ధికి మార్గదర్శిగా నిలుస్తోంది.