ట్రంప్ సుంకాల నిర్ణయం ప్రపంచ మార్కెట్లలో భయాందోళనలు సృష్టిస్తోంది. ఆ దేశాల నుండి అమెరికాకు ఎగుమతి చేసే ఉత్పత్తులపై డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రతీకార సుంకాలను విధించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం ఇటీవల ఐఫోన్ ప్రియులకు షాక్ ఇచ్చింది. అమెరికా ప్రభుత్వం విధించిన తాజా సుంకాలతో ఐఫోన్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఐఫోన్లు చైనాలో తయారవుతాయి. సుంకాల జాబితాలో చైనాపై 34 శాతం విధించనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ అదనపు సుంకాల భారం ఐఫోన్ల ధరలపై పడనుంది. ఐఫోన్ 16 మోడల్ ధర 799 డాలర్లు (రూ. 68 వేలు). వినియోగదారులపై సుంకాల భారం మోపితే అది 1,142 డాలర్లు (రూ. 97 వేలు) చేరుకుంటుంది. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ (1TB మోడల్) ధర $2,300 (రూ. 2 లక్షలు) ఉంటుందని అంచనా.
అయితే, టారిఫ్ ప్రభావం కారణంగా పెరిగిన ధరలను భరించాలా లేక వినియోగదారులకు బదిలీ చేయాలా అనేది ఆపిల్ ఇంకా నిర్ణయించలేదు. పన్నుల భారాన్ని వినియోగదారులపైకి బదిలీ చేస్తే, వినియోగదారులు ఇతర బ్రాండ్ల ఫోన్‌లకు మారే అవకాశం ఉందని, తద్వారా ఐఫోన్ ప్రధాన పోటీదారు అయిన శామ్‌సంగ్‌కు ప్రయోజనం చేకూరుతుందని మార్కెట్ వర్గాలలో చర్చ జరుగుతోంది.