శనివారం సాయంత్రం 6 గంటల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల హడావిడి ముగియనుంది. ఏపీలో అధికార, విపక్షాల మధ్య హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్సీపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా.. ప్రతిపక్ష పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీలు పొత్తు పెట్టుకుని పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి ఏపీలో జరగనున్న ఎన్నికలు ఇరు పార్టీల నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజల్లోకి వెళ్లారు.
గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 13న జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం జరగనున్న సార్వత్రిక, పార్లమెంట్ ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ ముగిసింది. ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులు ముందస్తుగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Related News
ఈసారి రాష్ట్రవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్, ఇంటి ఓటింగ్, నిత్యావసర సేవల కేటగిరీలో మొత్తం 4.3 లక్షల మంది ముందస్తుగా ఓటు వేసినట్లు ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది. ఇదిలా ఉండగా 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ముందస్తు ఓటింగ్ 3.5 రెట్లు అధికంగా నమోదైనట్లు అధికారులు తెలిపారు.
1.2 లక్షల మంది సచివాలయ ఉద్యోగులు, 2 లక్షల మంది ఇతర ప్రభుత్వ ఉద్యోగులు, 40,000 మంది పోలీసు అధికారులు, 28,000 మంది ఇంటి ఓటర్లు, 31,000 మంది నిత్యావసర సేవా కేటగిరీ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ఎంపికను వినియోగించుకున్నారని ఏపీ ఎన్నికల సంఘం తెలిపింది.
కాగా, ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. సోమవారం 13న జరిగే పోలింగ్‌లో ప్రతి ఒక్క ఓటరు తప్పనిసరిగా వినియోగించుకోవాలని ఆయన కోరారు.