కొంచెం కష్టపడితే మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోవచ్చు!
ఆస్ట్రేలియా వంటి దేశాల్లో భారతీయ విద్యార్థులకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని దక్షిణ ఆస్ట్రేలియా ప్రీమియర్ పీటర్ మలినౌస్కాస్ హైదరాబాద్లో జరిగిన “స్టడీ అడిలైడ్” సదస్సులో తెలిపారు. పరిశోధనాత్మక కోర్సుల ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని, వీసా నియమాలు కూడా సరళంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
“ఆస్ట్రేలియాలో టెక్నాలజీ, సైన్స్, హాస్పిటాలిటీ, ఇంజినీరింగ్ వంటి రంగాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. భారతీయ విద్యార్థులు కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తారు, ఇది వారిని అన్ని రంగాల్లో ముందుంచుతుంది” అని ప్రీమియర్ అభిప్రాయపడ్డారు.
దక్షిణ ఆస్ట్రేలియాలోని ఫ్లిండర్స్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా వంటి ఉన్నత విద్యా సంస్థలు ఉత్తమమైనవిగా గుర్తించబడ్డాయి. ఇక్కడ చదివే విద్యార్థులకు మెరిట్ ఆధారిత స్కాలర్షిప్లు కూడా లభిస్తాయి. అలాగే, పోస్ట్-స్టడీ వర్క్ వీసా కోసం అదనపు ఒక సంవత్సరం ఎక్స్టెన్షన్ అవకాశం కూడా ఉంది.
భారత్-ఆస్ట్రేలియా విద్యా సహకారం:
ఈ సందర్భంగా, ఫ్లిండర్స్ యూనివర్సిటీ మరియు హైదరాబాద్ విశ్వవిద్యాలయం హెల్త్ కేర్, బిజినెస్ మేనేజ్మెంట్ రంగాల్లో ఉమ్మడి ట్విన్నింగ్ ప్రోగ్రామ్లను ప్రారంభించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియా హై కమిషనర్ ఫిలిప్ గ్రీన్, కాన్సుల్ జనరల్ హిలరీ మెక్ గ్చి హాజరయ్యారు.
ఉపాధి అవకాశాలు:
స్టడీ అడిలైడ్ CEO జేన్ జాన్స్టన్ గత రెండేళ్లలో 400కి పైగా భారతీయ విద్యార్థులు దక్షిణ ఆస్ట్రేలియాలో ఉపాధి పొందారని తెలిపారు. ఈ సదస్సులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జీవీఆర్కే ఆచార్య, ఒనెస్ క్రయోజెనిక్స్ CEO రామ్ మొదలైన ప్రముఖులు పాల్గొన్నారు.
కాబట్టి, విదేశీ విద్యకు ప్లాన్ చేస్తున్నారా..? ఆస్ట్రేలియా మీకు ఉత్తమ ఎంపిక కావచ్చు!