Nallamalla trip: వేసవి సెలవుల్లో మరిచిపోలేని అనుభవం… జంగిల్ క్యాంప్‌లో ఒక రోజు…

వేసవి సెలవులు మొదలయ్యాయి. పిల్లలకు స్కూల్‌లు సెలవులయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈసారి ప్రత్యేకమైన అనుభవం కోసం నల్లమల అడవులను చూసేయండి. ప్రకృతి అందాలతో పాటు విజ్ఞానం కూడా పొందే అవకాశం ఇక్కడ లభిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇప్పుడు నల్లమల ప్రాంతంలో వసతి, విజ్ఞాన పార్క్‌లు, వనమూలికల కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అందుకే ఈ వేసవి సెలవులు నల్లమలలో గడిపేందుకు ప్లాన్‌ చేస్తే జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకం అవుతుంది.

నల్లమల కొండలు తూర్పు కనుమలలో విస్తరించి ఉన్నాయి. నల్లమల అడవి మొత్తం 5,947 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 3,040 చదరపు కిలోమీటర్ల మేర రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం ఉంది. దీనికి నాగార్జునసాగర్-శ్రీశైలం పులుల అభయారణ్యం అని కూడా పిలుస్తారు. ఇది దేశంలోనే అతిపెద్ద పులుల అభయారణ్యాలలో ఒకటిగా పేరుపొందింది.

Related News

నల్లమల అడవిలో పర్యాటకులకు కావాల్సిన సౌకర్యాలు అన్ని ఉన్నాయి. సున్నిపెంట బయోడైవర్సిటీ కేంద్రం ఎదురుగా 8 హెక్టార్ల విస్తీర్ణంలో ఎకలాజికల్ నాలెడ్జ్ పార్క్ ఏర్పాటు చేశారు. ఈ పార్క్‌లో జురాసిక్ యుగం నుంచి భూమి పుట్టుక, జీవ పరిణామం వరకు జరిగిన మార్పులను చూపించే 53 పెద్ద బొమ్మలు ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు భూమి చరిత్ర గురించి అద్భుతమైన అవగాహన ఇక్కడ లభిస్తుంది. ఫ్యామిలీతో కలిసి శ్రమ లేకుండా ఆనందంగా గడిపే వాతావరణం ఉంటుంది.

నల్లమల అడవిలో వేలాది ఔషధ మొక్కలు ఉన్నాయి. సున్నిపెంట జీవవైవిధ్య కేంద్రం పరిధిలో అరుదైన ఔషధ గుణాలున్న 353 జాతుల మొక్కలను గుర్తించారు. వనమూలికల సంరక్షణ కేంద్రం కూడా ఏర్పాటైంది. రోళ్లపెంట నుంచి పెచ్చెర్వుగూడేనికి వెళ్లే దారిలో ఈ కేంద్రం ఉంది. ఇక్కడ ఒకే చోట 70 నుంచి 80 రకాల ఔషధ మొక్కలను చూడొచ్చు. ఈ మొక్కల విశేషాలు తెలుసుకోవడం పిల్లలకు ఎంతో ఉపయోగకరం. ఆరోగ్య ప్రాధాన్యత గల వనమూలికల గురించి జ్ఞానం పొందొచ్చు.

నల్లమల అడవిలో జీవ వైవిధ్యం విశేషం. భవిష్యత్ తరాలకు నల్లమల జీవజాలాన్ని పరిచయం చేసేందుకు 2001 డిసెంబరు 8న శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో జీవ వైవిధ్య పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 303 రకాల క్షీరదాలు, 102 రకాల సీతాకోక చిలుకలు, 80 రకాల పాములు, 55 రకాల చేపలు, 25 రకాల లాంబాలు, 18 రకాల కప్పలు, 77 రకాల కీటకాల వివరాలు ఉన్నాయి. ప్రపంచంలోనే అత్యంత వైవిధ్యభరితమైన సాలెపురుగును కూడా ఇక్కడ చూడవచ్చు. చిన్న పిల్లలకు జీవ వైవిధ్యం గురించి ప్రత్యక్షంగా తెలుసుకునే అరుదైన అవకాశం ఇది.

ఇక్కడి ముఖ్య ఆకర్షణల్లో రాజీవ్ గాంధీ పులుల అభయారణ్యం ప్రత్యేక స్థానం సంపాదించింది. 2024 లెక్కల ప్రకారం నల్లమల అడవిలో 87 పులులు ఉన్నట్టు అధికారికంగా నిర్ధారణ అయింది. జంగిల్ సఫారీ టూర్‌లో పులులు ప్రత్యక్షంగా కనిపించే అవకాశం ఉంది. ప్రకృతి ప్రేమికులు ఇక్కడ కృష్ణా నదీ అందాలను కూడా తిలకించవచ్చు. పచ్చని అడవులు, నిర్మలమైన నదీ జలాలు కలిసి చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

జంగిల్ క్యాంప్‌లో స్టే చేయాలనుకునే వారికి ప్రత్యేక వసతులు ఉన్నాయి. nstr.co.in వెబ్‌సైట్ ద్వారా ముందుగానే బుకింగ్ చేయవచ్చు. బైర్లూటిలో 4 కాటేజీలు, 6 టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే పచ్చర్లలో 4 కాటేజీలు, 2 టెంట్లు ఉన్నాయి. ఒక రోజు క్యాంప్ స్టే చేయాలంటే రూ.7,000 చెల్లించాల్సి ఉంటుంది. ఉదయం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 12 గంటల వరకు ఇక్కడ నివసించొచ్చు. క్యాంప్ స్టేలో భోజన సౌకర్యం కూడా ఉంది.

ఒకవేళ కేవలం జంగిల్ సఫారీ మాత్రమే చేయాలనుకుంటే, వాహనానికి రూ.3,000 చెల్లించి సఫారీకి వెళ్ళొచ్చు. ఒక వాహనంలో 10 మంది వెళ్లొచ్చు. వాహన సౌకర్యం, గైడ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది. ముందుగా www.nstr.co.inలో లాగిన్ అయ్యి అన్ని వివరాలు తెలుసుకొని ప్లాన్ చేసుకోవచ్చు.

శ్రీశైలంలో చెంచుల జీవనశైలిని వివరించే ప్రత్యేక మ్యూజియం కూడా ఉంది. ప్రాచీన కాలం నుంచి చెంచు జాతి జీవన విధానాన్ని అద్భుతంగా బొమ్మల ద్వారా ప్రదర్శించారు. ఇది చూసిన తర్వాత మన పూర్వీకుల జీవితం ఎలా ఉండేది అనేది తెలియజేసే గొప్ప అనుభూతి కలుగుతుంది.

మొత్తానికి చెప్పాలంటే… వేసవి సెలవుల్లో పిల్లలకు కొత్త విజ్ఞానం, ప్రకృతి సౌందర్యం, అడవి అనుభవం, ఆటపాటలతో మర్చిపోలేని రోజుల్ని గడిపించాలంటే నల్లమల అడవులు బెస్ట్ డెస్టినేషన్. ఒకవైపు జంగిల్ క్యాంప్ స్టే, మరోవైపు పులులు, నదులు, వనమూలికలు, జీవ వైవిధ్యం, చెంచు మ్యూజియం అన్నీ కలిపి ఒక పూర్తి అనుభవాన్ని ఇస్తాయి. ఆలస్యమేంటి? వెంటనే ఫ్యామిలీతో కలిసి ఒక అడ్వంచర్ ట్రిప్ ప్లాన్ చేయండి. ఈ వేసవిని నిజంగా మధుర జ్ఞాపకంగా మార్చుకోండి!