Coca-Cola: అమెరికా స్పోర్ట్స్ డ్రింక్ బ్రాండ్‌ను భారత్‌కు తీసుకొస్తున్న కోకాకోలా..

ప్రముఖ పానీయాల సంస్థ కోకా-కోలా అమెరికన్ స్పోర్ట్స్ డ్రింక్ బ్రాండ్ బాడీఆర్మర్ లైట్‌ను భారత మార్కెట్‌కు పరిచయం చేయనుంది. ఈ వేసవిలో ఈ కూల్ డ్రింక్‌ను తీసుకువస్తున్నట్లు గురువారం ఒక ప్రకటనలో ప్రకటించింది. బాడీఆర్మర్ లైట్ డ్రింక్ ఎలక్ట్రోలైట్స్, కొబ్బరి నీటితో కూడిన పానీయం. ఇది US మార్కెట్లో ఐదవ అత్యంత ప్రజాదరణ పొందిన బ్రాండ్‌గా కొనసాగుతోంది. స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో దీనికి బిలియన్ డాలర్ల మార్కెట్ కూడా ఉంది. దీనితో పాటు, హానెస్ట్ టీ, విటమిన్ వాటర్ వంటి మరో రెండు బ్రాండ్‌లను కూడా ప్రారంభిస్తామని కోకా-కోలా ఇండియా, సౌత్ వెస్ట్ ఆసియా వైస్ ప్రెసిడెంట్ సందీప్ బజోరియా తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం విటమిన్ వాటర్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా దేశంలోని విమానాశ్రయాలలో విక్రయిస్తున్నామని, త్వరలో మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని ఆయన అన్నారు. ఇటీవల దేశీయ కంపెనీ రిలయన్స్ కాంపా కోలాతో కూల్ డ్రింక్ మార్కెట్‌లో తన వ్యాపారాన్ని వేగవంతం చేయడం ప్రారంభించింది. స్పోర్ట్స్ డ్రింక్ విభాగంలో స్పిన్నర్ అనే కొత్త బ్రాండ్‌ను కూడా ప్రారంభించిన విషయం తెలిసిందే. కోకా-కోలా అమెరికా నుండి మరొక బ్రాండ్‌ను ప్రవేశపెట్టడంతో కంపెనీల మధ్య పోటీ తీవ్రమవుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ.. శీతల పానీయాల మార్కెట్లో పోటీని స్వాగతిస్తున్నట్లు సందీప్ బజోరియా అన్నారు. పోటీ మార్కెట్ వినియోగదారులకు కొత్త ఉత్పత్తులను అందించడానికి వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.