నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంటలోని SLBC టన్నెల్ కూలిపోయి అందులో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులు మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి సొరంగం ప్రమాద స్థలానికి వెళతారు. ప్రమాద స్థలాన్ని ఆయన స్వయంగా పరిశీలించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తారు. సీఎం పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ రేంజ్ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భారీ భద్రత ఏర్పాటు చేస్తారు.
మరోవైపు.. సొరంగం ప్రమాదంలో 8 మంది మరణించడం చాలా బాధాకరం అని అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ అన్నారు. రాడార్ ద్వారా మృతదేహాలను గుర్తించామని ఆయన అన్నారు. అక్కడ తవ్వకాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే వంశీ కృష్ణ వెల్లడించారు.. రేపు మధ్యాహ్నం నాటికి మృతదేహాలను వెలికితీసే అవకాశం ఉంది.