ఇప్పట్లో భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చెలరేగుతున్నాయి. పాకిస్తాన్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళాలు ఉగ్ర స్థావరాలపై దాడులు చేయడం తెలిసిందే. దేశం మొత్తం అప్రమత్తంగా మారింది. ఈ పరిస్థితుల్లో సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకే కాక, దేశంలోని ప్రతి ఇంట్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
ఎందుకంటే యుద్ధ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవచ్చు. విద్యుత్ పోవచ్చు, నెట్‌వర్క్ మాయం కావచ్చు, నీటి సరఫరా ఆగిపోవచ్చు. ఇలాంటి అత్యవసర సమయాల్లో మనకు కొంత వరకు సురక్షితంగా ఉండేందుకు కొన్ని గాడ్జెట్లు చాలా అవసరం.
ఒక్కసారి ఇంటి బయట ప్రపంచంతో కాంటాక్ట్ కోల్పోతే, మనం ఏం జరుగుతోందో తెలుసుకోలేము. అందుకే, కమ్యూనికేషన్, పవర్, తాగునీరు, వెలుతురు, ఆరోగ్యం వంటి విషయాల్లో కనీస అవసరాలను తీర్చే పరికరాలు మన ఇంట్లో ఉండాలి. ఇప్పుడు ఆ అవసరమైన గాడ్జెట్లను ఒక్కో శీర్షిక కింద వివరంగా చూద్దాం.
మొబైల్ నెట్‌వర్క్ పోయినా… ఇది బతికిస్తుంది
యుద్ధ సమయంలో మొదట నిలిచిపోయేది మోబైల్ నెట్‌వర్క్. నెట్‌పైనే ఆధారపడే ఈ రోజుల్లో అది ఆగిపోతే మనం ఏం జరుగుతోందో కూడా అర్థం చేసుకోలేము. అలాంటి సమయంలో మనకి సైనిక సమాచారం, ప్రభుత్వ అధికారిక ప్రకటనలు తెలుసుకోవాలంటే, మన దగ్గర బ్యాటరీతో నడిచే రేడియో లేదా క్రాంక్ రేడియో తప్పనిసరిగా ఉండాలి.
ఆల్ ఇండియా రేడియో ద్వారా దేశ స్థితిగతుల గురించి సమాచారాన్ని అందించవచ్చు. కొంతవరకు ఆత్మస్థైర్యాన్ని కలిగించగలిగే ఈ గాడ్జెట్‌లో ఫ్లాష్ లైట్, సోలార్ ఛార్జింగ్ వంటి అదనపు సదుపాయాలున్న రేడియో తీసుకుంటే మంచిది.
విద్యుత్ పోయిందంటే.. ఫోన్లు కూడా శవాలే
యుద్ధ పరిస్థితుల్లో విద్యుత్ అంతరాయం సాధారణ విషయం. కొన్ని గంటలు కాదు.. కొన్ని రోజులు కరెంట్ రాకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఫోన్లు, టార్చ్‌లు ఛార్జ్ చేయాలంటే సోలార్ పవర్ బ్యాంక్ తప్పనిసరిగా ఉండాలి. ఇది నేరుగా సూర్యరశ్మితో ఛార్జ్ అవుతుంది. అధిక సామర్థ్యం ఉన్న మోడల్స్ ఎంచుకుంటే, ఫోన్, రేడియో, లైట్లు అన్నీ ఛార్జ్ చేయొచ్చు. ఇక మల్టీ పోర్ట్స్ ఉంటే ఒకేసారి ఎక్కువ గాడ్జెట్లు ఛార్జ్ చేయడం సులభం అవుతుంది.
నీటి కోసం బయటకు వెళ్లకండి
ఏ యుద్ధ సమయంలోనైనా శుద్ధమైన నీరు దొరికే అవకాశం చాలా తక్కువ. నదులూ, బోర్లూ, ట్యాంకర్లూ అన్నీ పనిచేయకపోవచ్చు. అలాంటి సమయంలో ఇంట్లో పోర్టబుల్ వాటర్ ప్యూరిఫైయర్ ఉండటం ఎంతో అవసరం. అందులో ‘లైఫ్‌స్ట్రా’ అనే చిన్న పరికరం చాలా ఉపయోగపడుతుంది. దీనితో నేరుగా నీటిని శుద్ధం చేసి తాగొచ్చు. ఇది బ్యాక్టీరియా, వైరస్ లాంటి నీటిలో ఉండే హానికరమైన పదార్థాలను తొలగిస్తుంది. UV ఆధారిత ఫిల్టర్లు అయితే మరింత మెరుగ్గా పనిచేస్తాయి.
చీకటి కమ్ముకుంటే భయపడాల్సిన అవసరం లేదు
ఎమర్జెన్సీ సమయంలో విద్యుత్ పోయినప్పుడు ఇంటి చుట్టూ చీకటి అలుముకోవడం తథ్యం. రాత్రిళ్లు బయటకెళ్తే ప్రమాదం. అప్పుడు LED ఎమర్జెన్సీ లైట్లు, హెడ్‌ల్యాంప్‌లు మీకు దారి చూపిస్తాయి. వీటిని ముందే రీచార్జ్ చేసి పెట్టుకోవాలి. కొన్నింటికి సోలార్ ఛార్జింగ్ కూడా ఉంటుంది. హెడ్‌ల్యాంప్‌లు ముఖ్యంగా చేతులు ఖాళీగా ఉండేటట్లు చేస్తాయి. దీని వలన చీకట్లో మనం సురక్షితంగా మకాం మార్చవచ్చు. కుటుంబ సభ్యులకు సాయం చేయవచ్చు.
ఆసుపత్రులు అందుబాటులో లేకపోతే
యుద్ధ పరిస్థితుల్లో ఆసుపత్రులు పని చేయకపోవచ్చు. అప్పుడు చిన్న గాయాలు, జ్వరాలు, ఊపిరి తడబాట్లు వంటి సమస్యలకు ఇంట్లోనే ప్రాథమిక చికిత్స చేయడం తప్పనిసరి అవుతుంది. అందుకోసమే మెడికల్ ఎమర్జెన్సీ కిట్ అవసరం. ఇందులో డిజిటల్ థర్మామీటర్, పల్స్ ఆక్సిమీటర్, బ్యాండేజ్‌లు, జ్వరం, దగ్గు మందులు, సాధారణ యాంటీబయోటిక్స్ వంటివి ఉండాలి. ఈ కిట్ తోనే మీరు కుటుంబాన్ని ఇంట్లోనే ప్రాథమికంగా చూసుకోవచ్చు. బయటకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.
ముగింపు మాట
ప్రస్తుత కాలంలో ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎప్పుడైనా సంభవించొచ్చు. ప్రకృతి వైపరీత్యాలు, యుద్ధ పరిస్థితులు, ఉగ్రదాడులు అన్నీ ఒక్కసారిగా ముప్పుగా మారవచ్చు. అలాంటి సమయాల్లో మన కుటుంబాన్ని కాపాడుకోవాలంటే ఇప్పటి నుంచే సిద్ధంగా ఉండాలి. ఈ 5 గాడ్జెట్లు చిన్నవిగా అనిపించవచ్చు. కానీ అవి ఒక ఎమర్జెన్సీ సమయంలో మీ కుటుంబాన్ని ప్రాణాపాయ స్థితిలోంచి కాపాడగలవు. కనుక మీ ఇంట్లో ఇవి లేకపోతే వెంటనే కొనండి. ప్రాణభద్రతకు పెట్టుబడి పెట్టడం జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం.
మీ ఇంట్లో ఇవి లేవంటే ఇక ఆలస్యం చేయకండి… ఇప్పుడే సిద్ధం కావడం ప్రారంభించండి!