ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 95 (EPS-95) కింద పెన్షనర్లకు శుభవార్త. EPS-95 కనీస పెన్షన్ పెంపుపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. కనీస పెన్షన్ పెంపుతో సహా ఇతర డిమాండ్లను పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక శాఖ హామీ ఇచ్చిందని ఆందోళన కమిటీ తెలిపింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
2014 నుండి కనీస పెన్షన్‌తో సహా వివిధ డిమాండ్ల కోసం పోరాడుతున్న EPS-95 ఆందోళన కమిటీ శనివారం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. కేంద్రం తన సానుకూల వైఖరిని వ్యక్తం చేసిందని తెలిపింది. కేంద్ర కార్మిక మంత్రి మన్ సుఖ్ మాండవీయతో ఇటీవల జరిగిన చర్చలలో పెన్షన్ పెంపుతో సహా వివిధ డిమాండ్లకు సానుకూల స్పందన లభించిందని పెన్షనర్ల సంఘం తెలిపింది. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకుంటే దేశంలోని సుమారు 78 లక్షల మంది ప్రయోజనం పొందుతారని ఆందోళన కమిటీ వెల్లడించింది.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ 95 (EPS-95 పెన్షన్) కింద చెల్లించే కనీస పెన్షన్‌ను రూ. 7 వేలకు పెంచాలని ఆందోళన కమిటీ చాలా సంవత్సరాలుగా డిమాండ్ చేస్తోంది. చివరిగా 2014లో కనీస పెన్షన్‌ను రూ. 1000కి పెంచారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు చేయలేదు. దానిని రూ. 7 వేలకు పెంచాలని, పెన్షనర్లు వారి జీవిత భాగస్వాములకు ఉచిత ఆరోగ్య బీమా అందించాలని కూడా డిమాండ్లు ఉన్నాయి. అధిక పెన్షన్‌కు సంబంధించిన దరఖాస్తుల్లోని తప్పులను సరిదిద్దాలని కూడా పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు.
Related News
అయితే, ఫిబ్రవరి 1, 2025న సమర్పించిన 2025-26 వార్షిక బడ్జెట్‌లో ఈ అంశంపై ప్రకటన వస్తుందని పెన్షనర్లు భావించారు. కానీ ఎటువంటి ప్రకటన లేకపోవడంతో పెన్షనర్లు కాస్త నిరాశ చెందారు. ఈ నేపథ్యంలో పెన్షన్ ఆందోళన్ కమిటీ ఫిబ్రవరి 21, 2025న కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖలతో సమావేశమైంది. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సమస్యకు త్వరలో పరిష్కారం దొరుకుతుందని హామీ ఇచ్చారని ఆందోళన్ కమిటీ జాతీయ అధ్యక్షుడు అశోక్ రౌత్ వెల్లడించారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ వడ్డీని నిర్ణయించడానికి EPF సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు ఫిబ్రవరి 28, 2025న సమావేశమవుతున్నారు. PF ఖాతా వడ్డీతో పాటు EPS-95 పెన్షన్ పెంపుపై సానుకూల నిర్ణయం ఉంటుందని ఆందోళన్ కమిటీ చెబుతోంది.