తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. గోదావరి జిల్లాల్లో వైరస్ బారిన పడి చనిపోతున్న కోళ్లకు బర్డ్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయింది. పెరవలి మండలం కానూరు గ్రామంలోని కోళ్ల ఫారాల నుంచి తీసుకున్న నమూనాలకు పాజిటివ్ వచ్చింది.
దీనితో మరోసారి రెడ్ జోన్లు, సర్వే లెన్స్ జోన్లను ఏర్పాటు చేస్తున్నారు. రాజమండ్రి కలెక్టరేట్‌లోని 95429 08025 నంబర్‌తో కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. పక్షులు ఎక్కడ చనిపోతున్నాయో సమాచారం అందించాలని పశుసంవర్ధక శాఖ అధికారులను కోరుతూ హై అలర్ట్ జారీ చేశారు.
అయితే, కొన్ని రోజులుగా ప్రజలు చికెన్ తినడం తగ్గించాలని పశుసంవర్ధక శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, ఉంగుటూరు పరిసర ప్రాంతాల్లో సుమారు రెండు లక్షల కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన కానూరు 10 కిలోమీటర్ల పరిధిలో పోలీసులు 144, 133 సెక్షన్లను అమలు చేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి. శ్రీనివాసరావు మాట్లాడుతూ, వైరస్ లక్షణాలు కనిపించిన ఎవరికైనా యాంటీ వైరల్ మందులను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.