ఈ సంవత్సరం వేసవి వేడి ఇప్పటికే ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్‌లలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అవుతుండగా, కొన్ని ప్రాంతాలు అగ్నిగుండంలా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో, అమరావతి వాతావరణ కేంద్రం కీలక ప్రకటన విడుదల చేసింది. కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం మరియు రాయలసీమలోని దిగువ ట్రోపోస్పియర్‌లో పశ్చిమ-వాయువ్య దిశలో గాలులు వీస్తున్నాయని పేర్కొన్నారు. ఫలితంగా, రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు వాతావరణ సూచన ఇలా ఉంది.
ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ & యానాం: – గురువారం మరియు శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్: – గురువారం మరియు శుక్రవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. అలాగే, వేడి మరియు తేమతో కూడిన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. శనివారం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
రాయలసీమ:- గురువారం, శుక్రవారం మరియు శనివారం పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే, తెలంగాణలో సాధారణం కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఖమ్మం మరియు హనుమకొండలో ఎండలు మండిపోతున్నాయి. ఖమ్మంలో ఈరోజు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు దగ్గరగా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కూడా ఎండలు 37 డిగ్రీలు దాటుతున్నాయి. మార్చిలోనే తెలుగు రాష్ట్రాలు 125 ఏళ్ల తర్వాత రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల మధ్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని, ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.