గాయని మధు ప్రియ వివాదంలో చిక్కుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర ఆలయంలో ఆమె పాట చిత్రీకరణ వివాదాస్పదంగా మారింది.
కాళేశ్వరం గర్భగుడిలో మధు ప్రియ పాట చిత్రీకరణపై BJP నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు 2025 జనవరి 22న శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి కార్యాలయం ముందు బీజేపీ నాయకులు నిరసన తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా గర్భగుడిలో పాట చిత్రీకరణ చేసిన మధు ప్రియపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాళేశ్వరాలయ ఈఓను సస్పెండ్ చేయాలని కూడా వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఇదిలా ఉండగా, ఈ నెల 20న ఆలయ అధికారుల అనుమతి లేకుండా గర్భగుడిలో సినీ గాయని మధు ప్రియ ప్రైవేట్ ఆల్బమ్ పాటను చిత్రీకరించారు. గర్భగుడిలో ప్రైవేట్ పాట చిత్రీకరణపై గాయని మధు ప్రియ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. గర్భగుడిలోకి సెల్ ఫోన్లు, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం ఉన్నప్పటికీ పాటల షూటింగ్ నిర్వహించడంపై భక్తులు, హిందూ సంస్థలు, బిజెపి నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.