వ్యాపారం మొదలెట్టాలి, కానీ డబ్బు లేదు. చిన్నగా స్టార్ట్ అయినా చేయాలి, కానీ ఎవరు రుణం ఇస్తారు? అన్నవాళ్లకు ఇది చాలా బాగుంటుంది. మోడీ సర్కార్ తెచ్చిన ప్రధాన్ మంత్రి ముద్రా యోజన అంటే PMMY స్కీం ఇప్పుడు చిన్న వ్యాపారుల జీవితాన్ని మార్చేస్తోంది. ఎలాంటి తాకట్టు లేకుండానే బ్యాంక్ రుణం ఇస్తోంది. అది కూడా గరిష్ఠంగా 20 లక్షల రూపాయల వరకు! అయితే ఎలా అప్లై చేయాలి, ఏ బ్యాంకులో దరఖాస్తు చేయాలి, ఏ డాక్యుమెంట్లు అవసరం అవుతాయి అనే డౌట్స్ అందరికీ ఉంటాయి. అలాంటి వాళ్ల కోసం ఈ పూర్తి గైడ్ మీకోసం.
ముద్రా రుణం అంటే ఏమిటి?
ప్రధాన్ మంత్రి ముద్రా యోజన 2015లో మొదలైంది. ఇది ముఖ్యంగా నిరుద్యోగ యువతీ యువకులు, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి చేసుకునే వారు, మహిళల కోసం ప్రత్యేకంగా తెచ్చిన పథకం. ఈ పథకం కింద ఎవరైనా తమకు కావలసిన రుణాన్ని తక్కువ వడ్డీకి పొందవచ్చు. ముఖ్యంగా ఈ రుణాలను తాకట్టు లేకుండా ఇస్తారు. అంటే మీ దగ్గర స్థలంలేదనో, ఇంటి డాక్యుమెంట్లులేదనో అని బెదరాల్సిన పని లేదు.
ఇప్పటివరకు ఎంత మందికి లభించాయి?
2025 ఏప్రిల్ వరకు అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా దాదాపు 50 కోట్ల మంది ముద్రా రుణం పొందారు. ఈ రుణాల ద్వారా వారు తమ తమ వ్యాపారాలు ప్రారంభించారు. ఇక మొత్తంగా బ్యాంకులు 33 లక్షల కోట్ల రూపాయల రుణాలను ముద్రా యోజన కింద ఇస్తూ వచ్చాయి. ఇది చరిత్రలోనే పెద్ద సంఖ్యలో ప్రజలకు చేరిన వ్యాపార రుణ పథకం.
Related Posts
ఇప్పుడు 20 లక్షల వరకు రుణం ఇవ్వనున్నారా?
అవును. ముందు ఈ పథకంలో గరిష్ఠంగా 10 లక్షల వరకు మాత్రమే రుణం ఇచ్చేవారు. కానీ తాజాగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని పెంచింది. ‘తరుణ్ ప్లస్’ అనే కొత్త కేటగిరీ ద్వారా ఇప్పుడు 20 లక్షల వరకు రుణం పొందొచ్చు. ఇది ముఖ్యంగా పెరిగిన వ్యాపార అవసరాల కోసం తీసుకున్న మంచి నిర్ణయంగా భావిస్తున్నారు నిపుణులు.
ముద్రా రుణానికి అర్హతలు ఏమిటి?
మీ వయసు 18 ఏళ్లు దాటి ఉండాలి. మీకు ఒక స్పష్టమైన వ్యాపార ఆలోచన ఉండాలి. మీరు ఇప్పటికే చిన్న వ్యాపారం చేస్తున్నా, కొత్తగా ప్రారంభించాలన్నా మీరు ముద్రా రుణానికి అర్హులే. మహిళలు, యువతీ యువకులు, వ్యాపార ఆరంభ దశలో ఉన్న వారు ముద్రా లోన్ కోసం అప్లై చేయవచ్చు. ఇది మీకు ఒక వాణిజ్య రుణం అవుతుందన్న విషయం గుర్తుంచుకోండి.
ముద్రా రుణాల రకాలు
ముద్రా రుణాలను ప్రధానంగా నాలుగు కేటగిరీలుగా విభజించారు. మొదటిది శిశు. ఇది మొదటిసారి వ్యాపారం ప్రారంభించేవారికి ఉంటుంది. ఇందులో గరిష్ఠంగా రూ. 50,000 వరకు రుణం ఇస్తారు. రెండోది కిషోర్. ఇది వ్యాపారం అభివృద్ధి దశలో ఉన్న వారికి. ఇందులో రూ. 50 వేల నుంచి 5 లక్షల వరకు లభిస్తుంది. మూడోది తరుణ్. ఇది కొనసాగుతున్న వ్యాపారాన్ని మరింత విస్తరించాలనుకునే వారికి. ఇందులో రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇప్పుడు నాల్గవది ‘తరుణ్ ప్లస్’. ఇందులో 10 లక్షల నుంచి 20 లక్షల వరకు రుణం పొందొచ్చు.
కావలసిన డాక్యుమెంట్లు ఏవీ?
మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు తప్పనిసరి. మీ బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్, బిజినెస్ ప్లాన్ లేదా వ్యాపార వివరాలు ఉండాలి. మీరు ఇప్పటికే వ్యాపారం చేస్తుంటే GST వివరాలు, లైసెన్సులు ఉండాలి. కొత్తగా ప్రారంభించాలంటే వ్యాపారం ఎలా ఉంటుంది, ఎంత ఖర్చవుతుంది, ఎలా లాభం వస్తుంది అనే డీటెయిల్ ప్లాన్ ఇవ్వాలి.
ఎలా అప్లై చేయాలి?
మొదట మీ సమీపంలోని బ్యాంక్‌ను సంప్రదించండి. బ్యాంక్ మేనేజర్‌ను కలసి మీకు ఎంత రుణం కావాలో చెప్పండి. వారు మీకు అప్లికేషన్ ఫారం ఇస్తారు. దానిని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్లు జతచేసి సమర్పించాలి. మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం బ్యాంక్ మీ అప్లికేషన్‌ను పరిశీలిస్తుంది. అవసరమైతే వారు మీతో మరింత సమాచారం అడగవచ్చు. చివరికి మీకు రుణం మంజూరు చేయాలా వద్దా అని నిర్ణయిస్తారు.
ఎక్కడ లభిస్తుంది?
ముందు ప్రభుత్వ బ్యాంకులే మాత్రమే ముద్రా రుణాన్ని అందించేవి. ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు కూడా ఈ స్కీంలో భాగం అయ్యాయి. అలాగే గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ సంస్థలు, అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా ముద్రా రుణం ఇస్తున్నాయి. మీరు మీకు దగ్గరగా ఉన్న బ్యాంకులో అప్లై చేయవచ్చు.
వడ్డీ రేట్లు ఎలా ఉంటాయి?
బయట ప్రైవేట్ వ్యక్తుల నుంచి రుణం తీసుకుంటే అధిక వడ్డీ చెల్లించాలి. కానీ ముద్రా రుణాలపై తక్కువ వడ్డీ వసూలు చేస్తారు. ఇది బ్యాంకుపై ఆధారపడి ఉంటుంది. మీరు ఇచ్చే డాక్యుమెంట్లు, క్రెడిట్ స్కోరు ఆధారంగా వడ్డీ రేట్లు నిర్ణయిస్తారు.
ఇప్పుడు ఇదే సరైన సమయం
ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని పెంచింది. 20 లక్షల వరకు లభించే అవకాశం ఇప్పుడు అందుబాటులో ఉంది. మీ దగ్గర ఉన్న వ్యాపార ఆలోచనను నిజం చేసుకోవడానికి ఇదే సరైన టైం. మీ మనసులో ఉన్న ఆ బిజినెస్ ఐడియాను రియాలిటీలోకి మార్చేయండి. బ్యాంక్ వెళ్లండి, ముద్రా రుణం అప్లై చేయండి.
ఫైనల్ గా చెప్పాలంటే
ఒక్క మంచి ఆలోచన, ఒక మంచి పథకం మీ జీవితాన్ని మలుపు తిప్పగలదు. ముద్రా రుణం అనే అవకాశం ఇప్పుడు మీ ముందుంది. ఖాళీ కూర్చుంటే అవకాశాలు వస్తాయి అన్నమాట లేదు. ఈ అవకాశం తీసుకోండి, మీ వ్యాపారాన్ని మొదలెట్టండి. 20 లక్షలు కూడా తాకట్టు లేకుండా లభించే ఈ స్కీం గురించి ఇప్పుడు మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి చెప్పండి. ఎందుకంటే ఈ సమాచారం వాళ్ల జీవితాన్ని కూడా మార్చొచ్చు!