ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం డిజిటల్ గవర్నెన్స్ విషయంలో విప్లవాత్మకమైన మార్పులు తెస్తోంది. ఇందులో భాగంగా దాదాపు 160 ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తోంది.
ఈ వాట్సాప్ సేవల కోసం మన మిత్ర పేజీ అందుబాటులోకి తెచ్చారు. ఈ మన మిత్ర పేజీ ద్వారా తాజాగా కొత్త రేషన్ కార్డులను సైతం పొందే అవకాశం ఉంది. వాట్సాప్ ద్వారా సులభంగా కొత్త రేషన్ కార్డులను ఎలా అప్లై చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం జూన్ నెల నుంచి క్యూఆర్ కోడ్‌తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. దీని వల్ల రేషన్ కార్డుల విషయంలో జరుగుతున్న అవినీతికి అడ్డుకట్ట వేయడంతో పాటు పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా రేషన్ కార్డ్ అప్లై చేయాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ గైడ్ ద్వారా ఎలా దరఖాస్తు చేయవచ్చో చూద్దాం.
దరఖాస్తు విధానం:
- ముందుగా వాట్సాప్‌లో 95523 00009 నెంబర్‌కు HI అని టైప్ చేయాల్సి ఉంటుంది.
- ఆ తర్వాత మీకు రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులో ఉంచిన సేవల వివరాలు ప్రత్యక్షమవుతాయి. వాటిలో మీకు అవసరం అయిన సర్వీసును ఎంపిక చేసుకోవచ్చు.
- మన మిత్ర యాప్ ద్వారా మొత్తం 160 కన్నా ఎక్కువ సేవలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో విద్య, ఆరోగ్యం, రవాణా, రెవెన్యూ, మున్సిపల్ సేవలు, పోలీస్ శాఖలకు సంబంధించిన సేవలు అందుబాటులో ఉన్నాయి.
- ముఖ్యంగా వాట్సాప్ ద్వారా మీరు రేషన్ కార్డును సైతం అప్లై చేసుకోవచ్చు. మే 7వ తేదీ నుంచి ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఈ సర్వీసు ద్వారా మీరు కొత్త రేషన్ కార్డుతో పాటు పాత రేషన్ కార్డులో మార్పులు, చేర్పులు చేయవచ్చు.
- అలాగే ఈ కొత్త వాట్సాప్ సర్వీసులో కొత్త రేషన్ కార్డు దరఖాస్తులతో పాటు, కొత్త సభ్యులను యాడ్ చేయడం, పాత సభ్యులు చనిపోయిన వారిని తొలగించడం, కార్డు సరెండర్ చేయడం, చిరునామా మార్పు, కుటుంబాలు విడిపోయినప్పుడు కార్డు స్ప్లిట్ వంటి సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1.46 కోట్ల రేషన్ కార్డులు ఉన్నాయి. తద్వారా మొత్తం 4.24 కోట్ల మంది లబ్ధిదారులు ఇందులో ఉన్నారు.