ఒకప్పుడు అమెరికా అంటేనే భారతీయ తల్లిదండ్రులకు గోల్డెన్ డ్రీమ్. తమ పిల్లలు అక్కడ ఉన్నత విద్య చదవాలి. పెద్ద ఉద్యోగాలు పొందాలి. అక్కడే సెటిల్ అవ్వాలి. కానీ ఇప్పుడు ఆ కలలు మారిపోతున్నాయి. నిన్నటి వరకూ అమెరికాకు వెళ్లాలంటే వేల మంది పోటీ పడతే, ఈరోజు మాత్రం అదే అమెరికా వీసాలు తీసుకునే వారు కనిపించడం లేదు.
దీనికి కారణం… అమెరికాలో మారుతున్న పరిస్థితులు, ట్రంప్ తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు. ఈ మార్పు వల్ల భారతీయ తల్లిదండ్రులు, విద్యార్థులు ఏం నిర్ణయం తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
యూఎస్ వీసాలు ఖాళీగా
ఈ ఏడాది అమెరికా 1.4 లక్షల విద్యార్థి వీసా స్లాట్లను కేటాయించింది. ఇదే గత సంవత్సరం అయితే, ఈ స్లాట్లు ఓపెన్ అయ్యాక గంటల వ్యవధిలోనే అన్ని బుక్ అయిపోతుండేవి. కానీ ఇప్పుడు సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీసా ఇంటర్వ్యూలకు విద్యార్థులు ముందుకు రావడం లేదు. అమెరికన్ కాన్సులేట్ చాలా ఖాళీగా ఉందని, విద్యార్థుల నుంచి ఆసక్తి తగ్గిపోతున్నదని సమాచారం వస్తోంది. ఇంతటి మార్పు ఒక్కసారిగా ఎలా వచ్చింది?
ట్రంప్ వ్యూహమే కీలకం
ట్రంప్ ఇప్పటికే ఓపీటీ (Optional Practical Training) ను రద్దు చేస్తానని ప్రకటించారు. ఇది రద్దైతే విద్యార్థులు చదువు పూర్తి చేసిన తర్వాత అక్కడ ఉద్యోగం చేయలేరు. దీంతో చదువు పూర్తయ్యాక వెంటనే ఇండియాకి తిరిగి రావాల్సిన పరిస్థితి.
అంతేకాకుండా, అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్స్ చేయడంపై కఠిన నియమాలు విధిస్తున్నారు. పెరిగిన ఖర్చులు, రూమ్ రెంట్లు, ఇతర ఖర్చుల కారణంగా సాధారణ మధ్య తరగతి కుటుంబాల పిల్లలు అమెరికా చదువుల్ని త్యజిస్తున్నారు. ఇకపై అమెరికా వెళ్లి చదవడం అంటే కోట్ల రూపాయల వ్యయం మాత్రమే కాదు, భవిష్యత్తు అనిశ్చితితో కూడిన ప్రయాణమవుతుంది.
ఇండియానే బెస్ట్ ఎంపిక అంటున్న తల్లిదండ్రులు
ఇప్పటి తల్లిదండ్రులు ఎంతో తెలివిగా ఆలోచిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి.. అమెరికాలో చదవడానికి కోటి రూపాయలు ఖర్చు చేస్తే, అదే డబ్బుతో మన దేశంలోనే టాప్ ప్రైవేట్ యూనివర్శిటీ లేదా మెరుగైన ప్రభుత్వ యూనివర్శిటీల్లో చక్కగా చదివించవచ్చు. అంతే కాదు, ఇక్కడే చదివి క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా మంచి జాబ్ కూడా పొందవచ్చు.
అమెరికాలో చదువుకోవడానికి ఖర్చు పెట్టే మొత్తంతో ఇక్కడ ఇంటి డౌన్ పేమెంట్ కూడా చేయొచ్చు. ఇక అమెరికా చదువుతో వచ్చే ప్రయోజనం కూడా లేకపోతే ఎందుకు వెళ్లాలి?
అమెరికా ఇప్పుడు ‘ఓపెన్ ఆఫర్’ మోడ్లో
అమెరికా ఎంబసీలు ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి. మీడియా ద్వారా ప్రచారం చేయమంటున్నాయి. విద్యార్థులు రావాలంటున్నాయి. కానీ విద్యార్థులు మాత్రం ఒక్కొక్కరుగా వెనక్కి తగ్గిపోతున్నారు. గతంలో ఒక సీటు దక్కించుకోవడం కోసం ఎదురుచూసిన రోజులు ఇప్పుడు మారిపోయాయి. ఇప్పుడు వీసా కోసం అమెరికానే ఎదురు చూస్తోంది. ఇది పరిస్థితి ఎంత మారిపోయిందో చూపే సూచిక.
అమెరికాలో విద్యా కలలు ఇక భ్రమలే
ఇప్పుడున్న ట్రెండ్ చూస్తే, అమెరికా చదువు కలలు కాస్త భ్రమలుగా మారిపోతున్నాయి. ట్రంప్ నిర్ణయాలు, అమెరికాలో అధిక ఖర్చులు, ఉద్యోగ అనిశ్చితి కారణంగా విదేశీ చదువు ప్లాన్ చేసేవారు వెనక్కి తగ్గుతున్నారు. మనదేశంలో ఇప్పుడే గ్లోబల్ స్టాండర్డ్ విద్యా వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోంది. టాప్ మల్టీనేషనల్ కంపెనీలు మన దేశం వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడే ఉన్నత విద్య చదివి, ఇక్కడే మంచి ఉద్యోగం పొందగలిగితే.. ఎందుకు విదేశాలైన ఖర్చు?
తెలివైన నిర్ణయం తీసుకుంటున్న తల్లిదండ్రులు
ఈ మార్పు సాధారణంగా కనపడినా, దీని వెనక పెద్ద ఆర్ధిక ప్రయోజనం ఉంది. అమెరికా వెళ్లే ప్రతి విద్యార్థిపై సగటున 50 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుంది. ఈ ఏడాది చాలా మంది డ్రాప్ అవ్వడంతో భారత తల్లిదండ్రులకు రూ. 50,000 కోట్ల వరకు ఆదా అవుతుంది. ఇది అమెరికాకు నష్టం కానీ మన దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం. దేశంలోనే చదివే విద్యార్థులు దేశం కోసం పనిచేస్తారు. వారి శక్తి, జ్ఞానం మన దేశ అభివృద్ధికి ఉపయోగపడుతుంది.
అమెరికా కలలు ఇక కొత్త రూపం దాలుస్తున్నాయి. విదేశీ డిగ్రీల జోలికి వెళ్లకుండా, భారతదేశంలోనే ఉన్నత విద్యతో గొప్ప భవిష్యత్తు నిర్మించుకోవాలన్న స్పష్టత ఇప్పుడు యువతలో కనిపిస్తోంది. ఇది ఒక మంచి పరిణామం. భవిష్యత్‌లో మన దేశం విద్యా రంగంలో ప్రపంచంలో ముందుండాలంటే, ఇలాంటి తెలివైన నిర్ణయాలు మరింత అవసరం.
మరి మీరేమంటారు? ఇంత ఖర్చుతో అమెరికా వెళ్లాలా? లేక మన దేశంలోనే ఉన్నత స్థాయి విద్యతో భవిష్యత్తు నిర్మించుకోవాలా?