ఎండాకాలం వచ్చిందంటే చాలు, వేడికి ఉక్కిరిబిక్కిరి అయిపోతాం. శరీరంలో నీరు తక్కువవుతోంది అనే భయం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. పైగా వడదెబ్బలు, అలసట, నీరసం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
ఇలాంటి సమయంలో బాడీకి ఇన్‌స్టంట్ ఎనర్జీ ఇచ్చే, మంచి రుచికరమైన స్వీట్ దొరికితే ఎంతో హాయిగా ఉంటుంది. అలాంటి ఓ అద్భుతమైన పాయసం మన తెలుగు ఇంటి వంటకాలలో ఒకటి. అదే సగ్గుబియ్యం పెసరపప్పు పాయసం. దీనిలో పెట్టే ఒక సీక్రెట్ పొడి ఈ పాయసానికి అంత రుచి, వాసన కలిపేస్తుంది.
ఎండాకాలంలో శరీరానికి చల్లదనం ఇస్తుంది
ఈ పాయసం తాగే వాళ్లకు వెంటనే ఒత్తిడి తగ్గినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఎండలో తిరిగి వచ్చినవాళ్లకు ఇది మంచి రిలీఫ్ లాంటి అనుభూతిని ఇస్తుంది. చల్లదనంతో పాటు రుచిగా కూడా ఉంటుంది. దీనిలో ఉండే సగ్గుబియ్యం వల్ల బాడీకి తక్షణ ఎనర్జీ లభిస్తుంది. పెసరపప్పు వల్ల ప్రోటీన్ వస్తుంది. పాలు, బెల్లం, నెయ్యి, డ్రైఫ్రూట్స్ అన్ని కలిస్తే ఇది పోషకాహారంతో నిండిన స్వీట్‌గా తయారవుతుంది. చిన్నా, పెద్దా అందరూ ఇష్టంగా తినేలా ఉంటుంది.
వంట చేసేందుకు కావాల్సిన పదార్థాలు
ఇది చేయడానికి సగ్గుబియ్యం, పెసరపప్పు, సేమియా, పాలు, బెల్లం, నెయ్యి, యాలకులు, సోంపు, డ్రైఫ్రూట్స్, కొబ్బరి ముక్కలు వంటి సామాన్యంగా ఇంట్లో ఉండే పదార్థాలే అవసరం. వీటన్నింటిని సరైన మోతాదులో కలపడం వల్లనే అసలైన రుచి వస్తుంది. ముఖ్యంగా యాలకులు-సోంపు పొడి ఈ పాయసానికి ప్రత్యేకమైన వాసన, రుచి ఇస్తుంది.
తయారీ విధానం – ఒక్కసారి ట్రై చేస్తే మరిచిపోలేరు
ముందుగా సగ్గుబియ్యాన్ని బాగా కడిగి, నీళ్ళలో పది నిమిషాలు నానబెట్టాలి. తర్వాత ఒక చిన్న రోటి లేదా మిక్సీలో సోంపు, యాలకులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది పాయసానికి మెజిక్కు లాంటి వాసన ఇస్తుంది.
ఇప్పుడొక పెద్ద పాన్‌లో పాలు పోసి మరిగించాలి. ఒక పొంగు వచ్చేంతవరకూ పాలను మరిగించాక పక్కకు తీసి చల్లారనివ్వాలి. తర్వాత కుక్కర్‌లో నెయ్యి వేసి వేడి అయ్యాక జీడిపప్పు, బాదం, ఎండు కొబ్బరి ముక్కలు వేసి ఫ్రై చేయాలి. ఇవి దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టాలి.
తర్వాత అదే కడాయిలో సేమియా, పెసరపప్పు వేసి ఓ నాలుగు నిమిషాలు నెమ్మదిగా ఫ్రై చేయాలి. దీనికి రెండు కప్పుల నీళ్లు, ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం కూడా వేసి బాగా కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చేవరకు ఉడికించాలి.
ఇప్పుడు మరో పాన్‌లో బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి తరిగించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత వడకట్టి ఉడికించిన మిశ్రమంలో కలపాలి. తర్వాత స్టవ్‌పై పెట్టి మళ్లీ మూడునిమిషాలు ఉడికించాలి. అప్పుడే ముందుగా తయారుచేసిన యాలకులు-సోంపు పొడి, చిటికెడు ఉప్పు వేసి కలిపితే అసలైన టేస్ట్ వస్తుంది.
స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన పాలును వేసి చివరగా వేయించిన డ్రైఫ్రూట్స్ కలపాలి. అంతే.. మళ్లీ మళ్లీ తినాలనిపించే చల్లదనంతో నిండిన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ!
ఇది ఎందుకు స్పెషల్ అనుకుంటున్నారా?
ఇది కేవలం ఒక పాయసం మాత్రమే కాదు. ఇది మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందించే సంపూర్ణ ఆహారం లాంటిది. దాహం తగ్గించడమే కాదు, మనం తిన్నప్పుడు దాన్ని మర్చిపోలేరు. యాలకులు, సోంపు వంటి పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బెల్లం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. సగ్గుబియ్యం వల్ల నీరసం తగ్గుతుంది. పెసరపప్పు వల్ల శరీర బలం పెరుగుతుంది.
ఈ పాయసం ఎండాకాలం నూటికి నూరు మార్కులు తెస్తుంది. చల్లగా వడ్డిస్తే ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రిజ్‌లో పెట్టినా గట్టిపడకుండా ఉంటుంది. అంటే ముందే తయారుచేసుకొని సాయంత్రం వరకు ఫ్రెష్‌గా తినవచ్చు.
ఇప్పుడు మీ ఇంట్లో ట్రై చేయండి
ఇన్ని మంచి గుణాలు ఉన్న ఈ పాయసం తయారు చేయడం చాలా ఈజీ. తక్కువ టైమ్‌లో, తక్కువ పదార్థాలతో చెయ్యవచ్చు. పైగా ఎండల్లో శరీరానికి కావాల్సిన ఎనర్జీ, చల్లదనం రెండూ లభిస్తాయి. పిల్లలకైనా, పెద్దలకైనా ఇదొక బెస్ట్ స్వీట్. ఈసారి వేసవిలో మార్కెట్ స్వీట్లు దూరంగా పెట్టండి… ఈ చల్లదన పాయసం ఒక్కసారి ట్రై చేయండి… మళ్లీ మళ్లీ చెయ్యాలనిపిస్తుంది.
మీరు కూడా ఈ రుచి, ఆరోగ్యానికి కలయిక అయిన పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం తయారుచేసి మీ కుటుంబ సభ్యులకు వడ్డించండి. ఒక్కసారి తిన్నాక అది వేసవి స్వీట్‌లో బెస్ట్ అని మీరే చెబుతారు.
ఇలా స్వల్ప సమయంతో, తక్కువ కష్టంతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్ కావాలనుకుంటే ఇది మిస్ చేయకండి!