పూరీ అంటే చాలామందికి ఇష్టం. కానీ ప్రతిసారి అదే తరహా పూరీలు కాకుండా, కాస్త తియ్యగా, వెరైటీగా ఉండేలా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే, మీ కోసం అద్భుతమైన రెసిపీ సిద్ధంగా ఉంది. అదే ‘పాకం పూరీలు’. ఈ పూరీలు తింటే ఒక్కసారి కాదు పదిసార్లు తినాలనిపిస్తుంది.
స్వీట్లు ఇష్టపడే వాళ్లకి ఈ పాకం పూరీ పేరు చెప్పగానే నోట్లో నీళ్లు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఈ రెసిపీ పండుగల సమయాల్లో ఎంతో పాపులర్. కానీ దీన్ని ఏ ఫెస్టివల్‌కి పరిమితం చేయాల్సిన పనిలేదు. ఎప్పుడైనా తియ్యటి దినుసు తినాలనిపించినప్పుడు ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు.
పిండిని ఎలా తయారుచేయాలి?
ముందుగా మైదా పిండిని తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. ఇది బ్రెడ్ పొడిలా రాకుండా చేయాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా పిండి కలపాలి. చపాతీ ముద్దలా సాఫ్ట్‌గా ఉండాలి. ఈ ముద్దపై తడి వస్త్రం కప్పి అరగంట పాటు పక్కన పెట్టాలి. ఈ టైంలో ముద్ద బాగా నానుతుంది. మీరు పిండిని ఎంత బాగా వత్తుకుంటే, పూరీలు అంత సాఫ్ట్‌గా, జ్యూసీగా ఉంటాయి.
పాకం ఎలా తయారుచేయాలి?
ఇప్పుడు పాకాన్ని రెడీ చేయాలి. ఒక గిన్నెలో అరకిలో చక్కెర, సుమారు 150 ఎంఎల్ నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టాలి. చక్కెర కరిగి తీగ పాకం వచ్చేంత వరకు మరిగించాలి. ఇది పూరీల రుచికి ఎంతో కీలకం. పాకం తగిన విధంగా తయారైతేనే పూరీలు రుచిగా, రెండు వారాల వరకు నిల్వ ఉంటాయి. పాకం తయారైన తర్వాత అందులో యాలకుల పొడి వేసి కలిపి స్టవ్ నుంచి దించాలి.
పూరీలు ఎలా వత్తుకోవాలి?
ఇప్పుడు అరగంట నానబెట్టిన పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఒక్కో ఉండను చపాతీ కర్రతో రౌండ్‌గా, పల్చగా వత్తుకోవాలి. ఆపై ఒక్క వైపు కొద్దిగా నెయ్యి రాసి మడత వేసి మరోసారి వత్తుకోవాలి. ఇలా చేస్తే పూరీలు చక్కగా ఫోల్డెడ్ లేయర్స్‌తో ఉంటాయి. తక్కువగా వత్తుకుంటే జ్యూసీగా, ఎక్కువగా వత్తుకుంటే క్రిస్పీగా వస్తాయి.
వెయ్యించడం మరియు పాకంలో వేసే విధానం
ఇప్పుడు కడాయిలో నూనె వేసి బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఒకొక్క పూరీ వేసి వేయించాలి. అవి బంగారు రంగు వచ్చేంతవరకు కాల్చాలి. నూనెలో నుండి తీసిన వెంటనే వేడి వేడి పూరీలను చక్కెర పాకంలో వేయాలి. కనీసం 30 సెకన్ల పాటు పాకంలో ఉంచాలి. అప్పుడే పాకం పూరీలోకి బాగా చేరుతుంది. వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేస్తేనే అది పూరీలోకి బాగా చొచ్చుకుపోతుంది.
సర్వ్ చేయడం మరియు నిల్వ ఉంచడం
ఈ పూరీలు వేడి వేడి ఉండగానే తింటే ఒక రుచి, చల్లారిన తర్వాత తింటే ఇంకో రుచి. రెండు సందర్భాల్లోనూ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. మరింత ఆనందంగా ఉండేందుకు వీటిని వేడి పాలతో కలిపి కూడా తినొచ్చు. ముఖ్యంగా పిల్లలకి ఈ స్వీట్ పూరీలు ఎంతో ఇష్టం పడతారు. సరైన పాకం పట్టి, సాఫ్ట్‌గా వత్తుకుంటే ఈ పూరీలు కనీసం 15 రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి.
పండుగలు కాదు, సాధారణ రోజుల్లో కూడా ఈ తియ్యని పాకం పూరీలను ఇంట్లో తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరికి తినిపించండి. ఒక్కసారి మీరు చేస్తే, మీ ఇంట్లో వారంతా మళ్లీ మళ్లీ అడుగుతారు. మరి ఆలస్యం ఎందుకు? మీ కిచెన్‌లో ఉండే మైదా, చక్కెరతోనే ఈ అద్భుతమైన స్వీట్ పూరీ రెసిపీని ఇప్పుడే ట్రై చేయండి!