ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. ఈ టెక్నాలజీని మానవాళి మంచికి వినియోగిస్తే మంచిదే. కానీ దుర్వినియోగం అయితే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. బ్యాంక్ అకౌంట్‌లో నగదు వేసి ఇంటికి వచ్చేసరికి… సైబర్ నేరగాళ్ళు మాయోపాయంతో డబ్బులు దోచుకుంటున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి… రూ.500 నోట్ల నకిలీ వెర్షన్లు చెలామణి అవుతున్నాయి. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ విషయంలో హెచ్చరిక జారీ చేసింది. ఈ నోట్లు అసలు నోట్లను అనుకరించి ఉంటాయి. సాధారణంగా గమనించినప్పుడు వాటి నకిలీ స్వభావం తెలియదు.
అసలు, నకిలీ నోట్ల మధ్య తేడా చాలా సూక్ష్మంగా ఉంటుంది. RESERVE BANK OF INDIA అనే పదంలో ‘RESERVE’లో… ‘E’ కి బదులుగా ‘A’ అని ముద్రించబడి ఉంటుంది. ఈ చిన్న తప్పును గమనించడం కీలకం. ప్రతి ఒక్కరూ డబ్బులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ నకిలీ నోట్లు చాలా ప్రమాదకరమని హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.
బ్యాంకులు, సంస్థలు, ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సమాచారాన్ని డీఆర్ఐ, సీబీఐ, ఎన్‌ఐఏతో పంచుకున్నారు. ప్రజలు, వ్యాపారస్తులు ఈ విషయంలో ఎక్కువ జాగ్రత్త వహించాలి. నకిలీ కరెన్సీ వల్ల ఎవరూ నష్టపోకుండా చూసుకోవాలి.