ఇటీవల ChatGPT కొత్త Ghibli-స్టైల్ ఇమేజ్ జనరేటర్ కారణంగా వార్తల్లో నిలిచింది. లక్షల మంది తమ ఫోటోలను గిల్బి స్టైల్‌లో మార్చుకుని షేర్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదే AI టూల్ అక్రమాలకు దారి తీస్తుందనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
సోషల్ మీడియాలో కొందరు యూజర్లు, ChatGPT నకిలీ ఆధార్, PAN కార్డులను సృష్టించగలదని చెప్పి స్క్రీన్‌షాట్లు షేర్ చేశారు. ఇది పెద్ద మోసాలకు దారి తీస్తుందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు అయితే AI ను నియంత్రించేలా కఠిన చట్టాలు రావాలని డిమాండ్ చేస్తున్నారు.
ఒక యూజర్ LinkedIn లో, “ChatGPT తో నకిలీ ఆధార్, PAN కార్డులు తయారు చేయవచ్చట. ఇది నిజం అయితే పెద్ద సమస్య. మోసగాళ్లు దీన్ని ఉపయోగించి బ్యాంక్ ఫ్రాడ్, ఫైనాన్షియల్ క్రైమ్స్ చేయడం సులభమవుతుంది” అని వ్యాఖ్యానించారు.
Related News
ChatGPT నిజంగా నకిలీ ఆధార్, PAN కార్డులు తయారు చేస్తుందా?
Moneycontrol.com ChatGPT ను పరీక్షించడానికి Mac యాప్‌లో ఆధార్ ఇమేజ్ సృష్టించమని అడిగింది. కానీ ChatGPT “నేను ఆధార్ కార్డు రూపొందించలేను. మీకు అవసరమైతే అధికారిక UIDAI వెబ్‌సైట్ లేదా నమోదు కేంద్రాన్ని సంప్రదించండి” అని సమాధానమిచ్చింది.
అలానే, iPhone యాప్‌లో ChatGPT “నేను అధికారిక గుర్తింపు పత్రాలను రూపొందించలేను. కానీ ప్రెజెంటేషన్ కోసం ‘టెంప్లేట్ స్టైల్ గ్రాఫిక్’ తయారు చేయగలను” అని చెప్పింది.
దీనిపై News18 కూడా పరీక్షించింది. ChatGPT ను PAN కార్డు సృష్టించమని అడిగితే, “ఇది భారత ప్రభుత్వ గుర్తింపు పత్రం. దాన్ని రూపొందించలేను. PAN కార్డు కావాలంటే NSDL లేదా UTIITSL వెబ్‌సైట్ ద్వారా అప్లై చేయండి” అని చెప్పింది.
తదుపరి ప్రయత్నంలో, “నిజమైన ఆధార్ కార్డు కాదు, కానీ డిజైన్‌కి సంబంధించిన ఒక టెంప్లేట్ తయారు చేయగలను” అని చెప్పింది. కానీ ChatGPT నిజమైన పేర్లు, వివరాలను మార్చి ఇమేజ్ రూపొందించేందుకు నిరాకరించింది.
అయితే, సోషల్ మీడియాలో చాలా మంది యూజర్లు ChatGPT స్క్రీన్‌షాట్లు షేర్ చేస్తూ “ఇది ఆధార్ కార్డులను రూపొందించగలదా? దానికి ట్రైనింగ్ డేటా ఎక్కడి నుంచి వచ్చింది?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఈ ఆరోపణల నేపథ్యంలో, AI టూల్స్ వినియోగంపై మరింత కఠిన నియంత్రణలు రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.