రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం అనే కొత్త పథకాన్ని అమలు చేస్తోంది. దీని ద్వారా నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోసం రూ. 3 నుండి రూ. 5 లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. సంక్షేమ శాఖలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల సహాయంతో ఈ పథకాన్ని అమలు చేస్తాయి. ఇదిలా ఉండగా.. రుణాల కోసం ఏప్రిల్ 5 లోపు దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఈ పథకాన్ని రూ. 6,000 కోట్లతో అమలు చేస్తున్నామని రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల మందికి తక్కువ కాకుండా సహాయం అందిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికీ చెప్పారు. ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియను సీఎం రేవంత్ రెడ్డి నేడు అధికారికంగా ప్రారంభిస్తారు.
డిప్యూటీ సీఎం సమీక్ష
రాజీవ్ యువ వికాసం అమలును డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదివారం బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్షించారు. వారు ప్రధానంగా పథకం నిబంధనలు, షరతులపై చర్చించారు. యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చామని ఆయన అన్నారు. ఈ పథకం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతకు ఒక సువర్ణావకాశమని ఆయన అన్నారు. ఈ సమీక్షలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లు ప్రీతమ్, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్ తదితరులు పాల్గొన్నారు.